ఎన్‌ఎండీసీ వజ్రాల వేట!

8 Nov, 2017 00:56 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ గనులకు బిడ్‌ యోచన

పోటీలో వేదాంత,  అదానీ కూడా...

ఈ నెలాఖరులోపు వేలం నిర్వహణ

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో విస్తరించి ఉన్న 9 బిలియన్‌ డాలర్ల విలువైన (రూ.57,600 కోట్ల) వజ్రాల గనులకు బిడ్లు వేసే ఆలోచనతో ఉంది. ఇప్పటికే అదానీ, వేదాంత ఈ వజ్రాల గనులపై కన్నేసిన విషయం తెలిసిందే. వీటి సరసన పోటీలోకి ఎన్‌ఎండీసీ కూడా రానున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అధికారులతో మాట్లాడేందుకు ఎన్‌ఎండీసీ త్వరలోనే ఓ బృందాన్ని కూడా పంపనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి.

వజ్రాల గనిని నామినేషన్‌ ప్రాతిపదికన తమకు నేరుగా కేటాయించాలని కోరగా, దాన్ని కేంద్రం తోసిపుచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. విశాల ప్రయోజనాల కోణంలో గనులను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. మధ్యప్రదేశ్‌లోని బందర్‌ ప్రాంతంలో 32 మిలియన్‌ క్యారట్ల నిల్వలు ఉన్నట్టు అంచనా. ఈ గనిని అంతర్జాతీయంగా వజ్రాల మైనింగ్‌లో పేరొందిన రియో టింటో ఈ ఏడాది ఆరంభంలో వదిలిపెట్టి వెళ్లిపోయిన విషయం గమనార్హం.

ఈ నెలాఖరులోపు బందర్‌ వజ్రపు గనికి మధ్యప్రదేశ్‌ సర్కారు వేలం నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 30 నాటికి టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడుతుందని మధ్యప్రదేశ్‌ మినరల్‌ రిసోర్సెస్‌ ఉన్నతాధికారి మనోహర్‌లాల్‌ దూబే తెలిపారు. అటవీ అనుమతులు వేగంగా ఇచ్చేందుకు పర్యావరణ  శాఖ లోగడే హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇక నూతన ఖనిజ వనరుల విధానంలో భాగంగా భారీ ప్రాజెక్టులకు బిడ్లు వేసేందుకు అర్హతలను సడలించనున్నారు.

వజ్రాల వేట: మధ్యప్రదేశ్‌లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న బందర్‌ గనిపై రియోటింటో సంస్థ 14 ఏళ్ల పాటు శ్రమించింది. 90 మిలియన్‌ డాలర్లు (రూ.576 కోట్లను) ఖర్చు చేసింది. ఈ ప్రాంతం పులులకు ఆవాసం కావడంతో పర్యావరణ అనుమతుల్లో ఆలస్యం చోటు చేసుకుంది. దీంతో రియోటింటో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

తాజా వేలం ప్రతిపాదన నేపథ్యంలో ఇటీవలే వేదాంత రిసోర్సెస్, అదానీ గ్రూపు ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించారు. మరోవైపు ఎన్‌ఎండీసీ ఇప్పటికే వజ్రాల వెలికితీతలో ఉంది. మధ్యప్రదేశ్‌లోనే మజ్‌గావన్‌ గని నుంచి మిలియన్‌ క్యారట్‌ వజ్రాలను వెలికితీసిన అనుభవం కూడా ఉంది. దీంతో బందర్‌ గనికి కూడా పోటీ పడాలనుకుంటోంది.

>
మరిన్ని వార్తలు