‘ఎవరు చనిపోయినా అవి మాత్రం ఆగవు’

12 Dec, 2023 11:18 IST|Sakshi

సహారా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ సుబ్రతారాయ్‌ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సహారా గ్రూప్‌ నేరాలకు పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణ జరుపుతోంది. రాయ్‌ మరణంతో ఆ దర్యాప్తు పరిస్థితికి సంబంధించి బాధితుల్లో ఆందోళన మొదలైంది. దాంతో పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ సమాధానమిచ్చారు.

సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో)సహా కంపెనీల చట్టం కింద చేస్తున్న మరే ఇతర విచారణలైనాసరే ఎవరో ఒకరు చనిపోయారని ఆగబోవు అంటూ సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నవంబర్‌ 14న సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్‌ మరణించిన నేపథ్యంలో ఈ మేరకు లోక్‌సభలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.

2018 అక్టోబర్‌ 31న సహారా గ్రూప్‌నకు చెందిన సహారా హౌజింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సహారా క్యూ షాప్‌ యూనిక్‌ ప్రోడక్ట్స్‌ రేంజ్‌ లిమిటెడ్‌, సహారా క్యూ గోల్డ్‌ మార్ట్‌ లిమిటెడ్‌ సంస్థలపై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్‌ 7న సహారా గ్రూప్‌నకే చెందిన మరో ఆరు సంస్థలపై దర్యాప్తులకు ఆదేశించినట్టు మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కేసులో సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సహారా హౌజింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లను ఉద్దేశించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ అనుసరిస్తుందని, కోర్టు ఆదేశాల మేరకే బాధితులకు రిఫండ్‌ జరుగుతుందని తెలియజేశారు.

ఇదీ చదవండి: ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..!

‘డ్రాగన్‌’ కంపెనీలపై.. 

దేశంలో 53 చైనా సంస్థలున్నాయని లోక్‌సభకు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ సంస్థలు యాప్‌ల ద్వారా రుణాలస్తూ వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయా? లేదా అనే అంశం గురించి మాత్రం సమాచారం లేదని చెప్పారు. ఇక ఈ ఏడాది మే నెలలో సెంటర్‌ ఫర్‌ ప్రాసెసింగ్‌ యాక్సిలరేటెడ్‌ కార్పొరేట్‌ ఎగ్జిట్‌ (సీ-పేస్‌)ను ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి దేశంలో 7,700లకుపైగా కంపెనీలు స్వచ్చంధంగా తమ వ్యాపారాలను మూసివేశాయని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు