బ్యాంక్‌ కస్టమర్లకు వాట్సాప్‌లో నోటీసులు!!

15 Sep, 2018 02:30 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిజిటల్‌ ప్రయోగం

న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘించే ఖాతాదారులకు సంబంధించి కేసులను సత్వరం పరిష్కరించుకునే క్రమంలో ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. వాట్సాప్, ఈమెయిల్స్‌ ద్వారా కూడా నోటీసులు పంపుతోంది. ఇప్పటిదాకా 250 పైచిలుకు సమన్లను వీటి ద్వారా పంపినట్లు బ్యాంకు అధికారి ఒకరు వెల్లడించారు. వీరిలో ఎక్కువమంది మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందినవారని చెప్పారు. పోస్ట్‌ ద్వారా నోటీసులు పంపుతున్నా చాలా మంది కస్టమర్లు తమకెలాంటి సమన్లు రాలేదని చెబుతున్న నేపథ్యంలో ఈ కొత్త మాధ్యమాలను ఎంచుకున్నట్లు ఆయన తెలియజేశారు.

ఇళ్లు మారడం వల్ల కూడా కొన్నిసార్లు ఖాతాదారులకు నోటీసులు చేరకపోవచ్చని .. అయితే సాధారణంగా మొబైల్‌ ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీలను ఎక్కువగా మార్చరు కాబట్టి సమాచారం అందించేందుకు వాట్సాప్, ఈ మెయిల్స్‌ మెరుగైన సాధనాలని చెప్పారాయన. దేశవ్యాప్తంగా దాదాపు 60 లక్షల చెక్‌ బౌన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. సమన్ల జారీకి డిజిటల్‌ మాధ్యమాలను వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలన్న తమ బ్యాంక్‌ అభ్యర్ధనకు కోర్టులు సానుకూలంగా స్పందించడంతో ఇది సాధ్యపడుతోందని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు