ఎన్‌పీఎస్‌కు పూర్తిగా పన్ను మినహాయింపు

11 Dec, 2018 01:11 IST|Sakshi

ఉద్యోగుల తరఫున   ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు

18 లక్షల ఉగ్యోగులకు ప్రయోజనం

పలు కీలక మార్పులకు ఆమోదం

న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వ చందాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. అలాగే, ఎన్‌పీఎస్‌ నుంచి రిటైర్మెంట్‌ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను ఉండదని తెలిపారు. దీంతో పీపీఎఫ్, ఈపీఎఫ్‌ పథకాల మాదిరే ఎన్‌పీఎస్‌కు కూడా ఈఈఈ హోదా (మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు) లభించనుంది. కార్యదర్శుల కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వ చందాను 14 శాతానికి పెంచాలని గత వారమే కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని జైట్లీ వెల్లడించారు. ఆర్థిక బిల్లులో మార్పులు చేసిన తర్వాత ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రయోజనాలు అమల్లోకి రానున్నాయని అధికార వర్గాల సమాచారం. ప్రభుత్వ నిర్ణయం 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించనుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించి కేంద్రం నమూనాను అనుసరించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని జైట్లీ అభిప్రాయపడ్డారు. మీడియాకు మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం...

ఇకపై ఈ ప్రయోజనాలు
ప్రస్తుత నిబంధనల ప్రకారం రిటైర్మెంట్‌ నాటికి సమకూరిన నిధి నుంచి 40 శాతం మొత్తంతో తక్షణం పెన్షన్‌ వచ్చే యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై పన్ను లేదు. మిగిలిన 60 శాతాన్ని ఎన్‌పీఎస్‌ చందాదారులు తీసేసుకోవచ్చు. ఇందులో 40 శాతాన్ని పన్ను మినహాయింపు ఇస్తూ మిగిలిన 20 శాతంపై పన్ను అమలు చేస్తున్నారు. ఇకపై ఉపసంహరించుకునే మొత్తం  60 శాతంపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ వెసులుబాటు ఎన్‌పీఎస్‌ చందాదారులు అందరికీ వర్తిస్తుంది. ఇప్పటి వరకు టైర్‌–1 కింద జమ చేసే వాటికే పన్ను మినహాయింపు ఉండగా, కొత్తగా టైర్‌–2కింద జమచేసే మొత్తంలో రూ.1.5 లక్షలకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపును కేంద్రం కల్పించింది. ఇందుకు గాను టైర్‌–2 ఖాతా కింద జమలపై మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ అమలవుతుంది. ఎన్‌పీఎస్‌లో టైర్‌–1 అకౌంట్‌లో జమలను 60 ఏళ్లు వచ్చే వరకు ఉపసంహరించుకోవడానికి లేదు. కొన్ని ప్రత్యేక కారణాల్లోనే ఇందుకు అనుమతిస్తారు. టైర్‌–2 అకౌంట్‌ అన్నది స్వచ్చందంగా పొదుపునకు ఉద్దేశించిన అకౌంట్‌. టైర్‌–1 అకౌంట్‌కు అనుబంధంగా ప్రారంభించుకోవచ్చు. ఎప్పుడు అవసరమైనా ఇందులో మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇకపై మూడేళ్ల పాటు టైర్‌–2 అకౌంట్‌ డిపాజిట్‌లను వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి బేసిక్‌ వేతనంపై 14 శాతం ప్రభుత్వ చందాగా లభిస్తుంది. ఇది ప్రస్తుతం 10 శాతంగా ఉంది. ఇక ఉద్యోగుల వాటా 10 శాతంలో ఎటువంటి మార్పు లేదు. ఈ నిర్ణయం 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2,840 కోట్లను అదనంగా భరించాల్సి వస్తుంది. 2004 జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్‌ పథకంగా ఎన్‌పీఎస్‌ అమలవుతున్న విషయం గమనార్హం. ఎన్‌పీఎస్‌లో డెట్, ఈక్విటీల్లోనూ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించనుంది. అలాగే, తమకు నచ్చిన ఫండ్‌ మేనేజర్‌ సంస్థలను కూడా ఎంచుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుత మూడు ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకే అవకాశం ఉండగా, ఇకపై 8 ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల నుంచి ఎంపిక చేసుకోవచ్చు.   

మరిన్ని వార్తలు