ఎన్‌పీఎస్, ఈపీఎఫ్‌ - రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

6 Nov, 2023 07:06 IST|Sakshi

నాకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులు ఉండగా, వీటిని విక్రయించాను. ఈ లాభం లక్షలోపు ఉంది. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షలోపు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదని విన్నాను. అయితే, ఈ లాభాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాలా? అవసరం లేదా? – గురుమూర్తి

మీ వార్షికాదాయం ఆదాయపన్ను వర్తించే శ్లాబులో ఉంటే తప్పకుండా రిటర్నులు వేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేయాల్సిన ప్రతి ఒక్కరూ పన్ను పరిధిలోకి రాని మూలధన లాభం ఉన్నప్పటికీ దాన్ని రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. లిస్టెడ్‌ కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు కలిగినా లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను ఏడాదికి మించి కలిగి ఉంటే, వాటిపై వచ్చే లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)గా పేర్కొంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించిన లాభం వస్తే, ఆ మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌) ఆధారంగా మీరు దాఖలు చేయాల్సిన వార్షిక రిటర్నుల పత్రాల్లో ఈ వివరాలు ముందుగానే నింపి ఉంటాయి. 

కనీస ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోనే ఆదాయం ఉంటే, పన్ను వర్తించని మూలధన లాభాలను వెల్లడించక్కర్లేదు. ఆదాయపన్ను పాత విధానం కింద సీనియర్‌ సిటిజన్లు అయితే (60 ఏళ్లు నిండిన) వార్షికాదాయం రూ.3 లక్షలు ప్రాథమిక పన్ను మిహాయింపు పరిమితిగా ఉంది. 80 ఏళ్లు నిండిన వారికి ఇది రూ.5లక్షలుగా ఉంది. మిగిలిన వారికి రూ.2.5 లక్షలుగా ఉంది. నూతన పన్ను విధానంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆదాయపన్ను మినహాయింపు కనీస పరిమితి రూ.2.5 లక్షలుగానే ఉంది.

వార్షిక ఆదాయ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉన్నప్పటికీ, వాస్తవ ఆదాయం ఇంతకంటే తక్కువగా ఉన్న వారు మూలధన లాభాలు (స్వల్పకాల, దీర్ఘకాల) కలిగి ఉంటే, ఆ మొత్తాన్ని కనీస పరిమితి కింద భర్తీ చేసుకోవచ్చు ఉదాహరణకు వార్షికాదాయం రూ.1.8 లక్షలుగానే ఉండి, మూలధన లాభం రూ.లక్ష వచ్చి ఉంటే, అప్పుడు బేసిక్‌ పరిమితిలో మిగిలిన రూ.70వేలను భర్తీ చేసుకోవచ్చు. ఇది పోను మిగిలిన రూ.30వేలపైనే మూలధన లాభాల పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా కాకుండా మీ ఆదాయం రూ.2.5 లక్షలకు పైన ఉంటే, అప్పుడు మూలధన లాభాలను రిటర్నుల్లో వెల్లడించి నిబంధనల కింద పన్ను చెల్లించాల్సిందే.  

ప్రస్తుతం నేను పనిచేస్తున్న సంస్థలో నా నెలవారీ వేతనం నుంచి ఈపీఎఫ్‌ పథకానికి చందాలు వెళుతున్నాయి. నేను వచ్చే ఏడాది నేను పదవీ విమరణ తీసుకోబోతున్నాను. పీఎఫ్‌ నిధి సుమారు రూ.50 లక్షలుగా ఉంటుంది. ఈ సమయంలో ఎన్‌పీఎస్‌కు మారేందుకు కార్యాలయం నాకు ఆప్షన్‌ ఇచ్చింది. మరి నేను ఎన్‌పీఎస్‌కు మారాలా? అది నాకు ప్రయోజనమేనా? – రాజేష్‌ కుమార్‌ భాసిన్‌ 

రిటైర్మెంట్‌ ప్రణాళిక కోసం ఎన్‌పీఎస్, ఈపీఎఫ్‌ రెండూ ముఖ్యమైన పథకాలుగా ఉన్నాయి. ఈపీఎఫ్‌ అనేది మీ వేతనం నుంచి తప్పకుండా మినహాయించే ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆప్షన్‌. రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకోవడమే ఇందులోని ఉద్దేశం. పదవీ విమరణ సమయంలో చేతికి అందే మొత్తంపై పన్ను ఉండదు. ఎన్‌పీఎస్‌ అనేది స్వచ్ఛంద పథకం. పదవీ విరమణ నిధి ఏర్పాటుకు ఇది కూడా ఒక సాధనం. 

మీరు మరో ఏడాదిలో రిటైర్మెంట్‌ తీసుకుంటున్నారు. ఈపీఎఫ్‌ ద్వారా ఇప్పటికే నిధిని సమకూర్చుకున్నారు. కనుక ఈ సమయంలో ఎన్‌పీఎస్‌కు మారడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. వేచి చూసి రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే ఈపీఎఫ్‌ నిధిని మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌ చేసుకోవడం సరైనది. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునేట్టు అయితే, మీ ఉద్దేశ్యాలకు అనుగుణంగా సాధనాలను ఎంపిక చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకోకపోతే అప్పుడు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. స్వచ్ఛందంగా అయినా ఎన్‌పీఎస్‌ ఖాతాను 70 ఏళ్ల వరకు తెరిచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.


ధీరేంద్ర కుమార్‌ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు