మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పేటీఎం

5 Sep, 2018 00:27 IST|Sakshi

పేటీఎం మనీ ద్వారా ఇన్వెస్ట్‌ చేయొచ్చు

25 ఏఎంసీలతో ఒప్పందం

రూ.100 నుంచి సిప్‌ ప్రారంభం

2.5 కోట్ల మంది ఇన్వెస్టర్ల లక్ష్యం

న్యూఢిల్లీ: వన్‌97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం మనీ లిమిటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పేటీఎం మనీ పేరుతో యాప్‌ను మంగళవారం విడుదల చేసింది. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో 2.5 కోట్ల మందికి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉత్పత్తులను విక్రయించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ‘‘రానున్న మూడు నుంచి ఐదేళ్లలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో 5 కోట్ల మంది ఇన్వెస్ట్‌ చేయనున్నారు. ఇందులో మెజారిటీ వాటాను మేం ఆశిస్తున్నాం. అంటే 2–2.5 కోట్ల మంది మా లక్ష్యం’’ అని పేటీఎం మనీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ జాదవ్‌ తెలిపారు.

పేటీఎం మనీ వ్యాలెట్‌లో డబ్బులు లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్‌ నుంచి నేరుగా మ్యూచువల్‌ ఫండ్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చని జాదవ్‌ ప్రకటించారు. ఇప్పటికే 8,50,000 మంది యూజర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల కోసం తమ ప్లాట్‌ఫామ్‌పై పేర్లను నమోదు చేసుకున్నారని, వీరిలో 65 శాతం మంది టాప్‌–15 పట్టణాలకు వెలుపలే ఉన్నారని జాదవ్‌ తెలిపారు. రూ.100 నుంచి సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టుకునేందుకు పేటీఎం మనీ అవకాశం కల్పిస్తోంది. 25 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలతో (మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు/ఏఎంసీ) ఒప్పందం చేసుకుంది.

2019 నాటికి పేటీఎం మనీ ప్లాట్‌ఫామ్‌పై వన్‌97 కమ్యూనికేషన్స్‌ 10 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. టెక్నాలజీ, ఉత్పత్తుల అభివృద్ధి, డిజైన్‌ తదితర వాటికి వినియోగించనుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌గా సెబీ నుంచి ఈ ఏడాది ప్రారంభంలోనే కంపెనీకి అనుమతి లభించింది. ‘‘సంపద సృష్టి అవకాశాలు ఇప్పటికీ కొందరికే పరిమితమయ్యాయి. పేటీఎం మనీ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులను లక్షలాది మంది భారతీయులకు చేరువ చేయాలనుకుంటున్నాం’’ అని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే గత వారమే పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో 300–350 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు