పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం 88 శాతం డౌన్‌ 

27 Apr, 2019 01:26 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.28 తుది డివిడెండ్‌  

న్యూఢిల్లీ: పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 88 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) నాలుగో క్వార్టర్‌లో రూ.3,944 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం అదే క్వార్టర్‌లో రూ.456 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. అనుబంధ సంస్థల విలీనం కారణంగా రూ.3,569 కోట్ల పన్ను వాయిదా ప్రయోజనం లభించడంతో అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి బాగా ప్రయోజనం లభించింది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.28 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,991 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,680 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. నికర లాభం భారీగా తగ్గడంతో బీఎస్‌ఈలో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 5.7 శాతం తగ్గి రూ.2,410  వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు