టేబులే.. స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్‌!

26 Jun, 2019 11:04 IST|Sakshi

పగలు ఆఫీసులో.. రాత్రి ఇంట్లో.. మన మొబైల్‌ఫోన్లు విశ్రాంతి తీసుకునే స్థలమేది? ఇంకేముంది.. టేబుల్‌ లేదా ఛార్జర్‌!. మరి... ఈ రెండు ఒక్కటైపోతే ఎలాగుంటుంది? ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. వివరాలు చూద్దాం. స్పెయిన్‌కు చెందిన కంపెనీ ప్రొటాన్‌ న్యూ ఎనర్జీ ఓ కొత్త టేబుల్‌ను సిద్ధం చేసింది. దీనిపై ఉంచిన  మొబైల్‌ఫోన్‌కు విద్యుత్తును అందించడం ఈబోర్డ్‌గా పిలుస్తున్న ఈ టేబుల్‌ ప్రత్యేకత. ఇళ్లలో లేదా ఆఫీసుల్లో వాడే దీపాల వెలుగుతోనే విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఈబోర్డుపై ప్రత్యేకమైన సోలార్‌ప్యానెల్స్‌ ఉంటాయి.

ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో ఉంటే దాంతోనూ విద్యుదుత్పత్తి చేస్తుంది. మొత్తం 50 వరకూ ఛార్జింగ్‌ కాయిల్స్‌ కూడా ఏర్పాటు చేసిన ఈ టేబుల్‌పై ఎక్కడ ఫోన్‌ ఉంచినా ఛార్జింగ్‌ అవుతుంది. ఏకకాలంలో నాలుగు స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. కీ ఛార్జింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ను వాడుకుంటున్నందున ఈ టేబుల్‌ ద్వారా ఐఫోన్, శాంసంగ్‌ గెలాక్సీ, గూగుల్‌ పిక్సెల్‌ 3, 3ఎక్స్‌ ఎల్‌లతోపాటు సోని, నోకియా, ఎల్‌జీ వంటి ఫోన్లను స్మార్ట్‌వాచ్, ట్యాబ్లెట్లను ఛార్జ్‌ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ కీ ఛార్జింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ను వాడకపోతే అడాప్టర్లను వాడాల్సి ఉంటుంది. ఈ వినూత్న టేబుల్‌పై తాము సముద్ర బ్యాక్టీరియా తాలూకూ ప్రొటీన్‌తో తయారైన త్వచాన్ని వాడామని.. ఫలితంగా తక్కువ కాంతిలోనూ విద్యుత్తును ఉత్పత్తి చేయడం వీలవుతుందని కంపెనీ చెబుతోంది.

మరిన్ని వార్తలు