లాభాల బాటలోకి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

17 May, 2017 01:12 IST|Sakshi
లాభాల బాటలోకి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తిరిగి లాభాలబాటలోకి ప్రవేశించింది. 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 262 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో బ్యాంకు రూ. 5,361 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లడంతో పాటు ఎన్‌పీఏలను బ్యాంకు తగ్గించుకోగలిగింది. స్థూల ఎన్‌పీఏలు 12.90 శాతం నుంచి 12.53 శాతానికి, నికర ఎన్‌పీఏలు 8.61 శాతం నుంచి 7.81 శాతానికి తగ్గాయి. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం భారీగా 33 శాతం పెరిగి రూ. 3,684 కోట్లకు పెరగడంతో మొత్తం ఆదాయం రూ. 12,669 కోట్ల నుంచి రూ. 14,989 కోట్లకు చేరింది.

కేటాయింపులు తగ్గడంతో...
తమ ఎన్‌పీఏలు తగ్గడంతో మొండి బకాయిలకు కేటాయింపుల్ని రూ. 10,773 కోట్ల నుంచి రూ. 4,910 కోట్లకు తగ్గించుకోగలిగినట్లు బ్యాంకుకు కొత్తగా నియమితులైన మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ మెహతా చెప్పారు. కొన్ని రుణ ఖాతాల్ని పునర్‌వ్యవస్థీకరించామని, పెద్ద మొండి బకాయిలున్న ఖాతాల్ని పరిష్కరించేదిశగా ‘వార్‌ రూమ్‌’ను ఏర్పాటుచేశామని ఆయన వివరించారు. అలాగే బ్యాలెన్స్‌ షీట్‌ను మెరుగుపర్చుకోవడానికి నాన్‌–కోర్‌ ఆస్తుల్ని విక్రయించాలని యోచిస్తున్నామని, ప్రస్తుతానికి మార్కెట్‌ నుంచి మూలధనాన్ని సమీకరించే ఆలోచన ఏదీ లేదని ఆయన చెప్పారు. రిటైల్, ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ రంగాల నుంచి మంచి డిమాండ్‌ వున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణవృద్ధి 10–12 శాతం వుండవచ్చని అంచనావేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు