నెస్లేను తరిమేస్తా, కోల్గేట్‌కు గేట్ పెడతా

26 Apr, 2016 19:38 IST|Sakshi
నెస్లేను తరిమేస్తా, కోల్గేట్‌కు గేట్ పెడతా

న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా ఇప్పుడు ఆహార పదార్థాల వ్యాపార రంగంలోనూ తిరుగులేని బిజినెస్‌ మ్యాన్‌గా దూసుకుపోతున్నారు. పతంజలి గ్రూప్‌ ప్రొడక్ట్స్‌తో ఇప్పటికే కోల్గేట్‌, నెస్లే వంటి బహుళ జాతి సంస్థలకు ఎసరు పెట్టిన ఆయన తాజాగా మరో శపథం చేశారు. దేశం నుంచి 'నెస్లే' పక్షిని తరిమేస్తానని, 'కోల్గేట్‌'కు దేశంలోకి రాకుండా గేటు పెట్టేస్తానని, వాటిని భారత్‌లో లేకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10వేల కోట్ల టర్నవర్‌ సాధించడమే పతంజలి కంపెనీ లక్ష్యమని ఆయన మంగళవారం ప్రకటించారు. పతంజలి సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్‌ గా మారిందని ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు.

రాందేవ్‌ 2012 మార్చి నుంచి పతంజలి కంపెనీ ద్వారా పలు ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) ప్రొడక్ట్స్‌ను దేశంలో మార్కెట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. టూత్ పేస్ట్‌, న్యూడిల్స్, నెయ్యి వంటి పలు రకాల ఉత్పత్తులతో పతంజలి కంపెనీ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఈ కంపెనీ 2011-12లో రూ. 446 కోట్లు, 2012-13లో రూ. 850 కోట్లు, 2013-14లో రూ. 1200 కోట్లు, 2014-15లో రూ. 2006 కోట్ల టర్నోవర్ సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 150 శాతం వృద్ధితో రూ. ఐదువేల కోట్ల టర్నోవర్‌ను పతంజలి గ్రూప్ సాధించనుంది.

మరిన్ని వార్తలు