‘డర్టీ డజన్‌’పై దివాలా అస్త్రం!

14 Jun, 2017 07:39 IST|Sakshi
‘డర్టీ డజన్‌’పై దివాలా అస్త్రం!

ఆ 12 ఖాతాల సంగతి ముందు చూడండి
వారిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోండి
ఎన్‌పీఏలపై బ్యాంకుల్ని ఆదేశించిన రిజర్వు బ్యాంకు
మిగిలిన ఎన్‌పీఏలకు సంబంధించి ఆరునెలల్లో ప్రణాళిక
అప్పటికీ పరిష్కారం కాకుంటే వారిపైనా దివాలా కోడ్‌
కంపెనీ లా ట్రిబ్యునల్‌లోనూ ఈ కేసులకు ప్రాధాన్యం
ఎట్టకేలకు మొండి బకాయిలపై కార్యాచరణ షురూ!  


న్యూఢిల్లీ, మొండి బకాయిల పని పట్టడంలో భాగంగా కింగ్‌ఫిషర్‌ గ్రూపు అధినేత విజయ్‌ మాల్యాపై ఇప్పటికే బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో... అతనికంటె ఘనులు మరో 12 మందిని రిజర్వు బ్యాంకు గుర్తించింది. వారందరిపై దివాలా కోడ్‌ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా బ్యాంకుల్ని ఆదేశించింది. చిత్రమేంటంటే దేశవ్యాప్తంగా మొత్తం బ్యాంకులిచ్చిన బకాయిల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ 8 లక్షల కోట్లలో 25 శాతం... అంటే దాదాపు రూ.2 లక్షల కోట్లను ఎగవేసింది కేవలం 12 మంది!!. ‘‘ఈ 12 ఖాతాలపైనా తక్షణం దివాలా చట్టం కింద (ఐబీసీ) చర్యలు ఆరంభించవచ్చునని గుర్తించాం’’ అని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. అయితే ఈ 12 మంది పేర్లు మాత్రం వెల్లడించలేదు. నిరర్ధక ఆస్తులుగా మారిన రూ.8 లక్షల కోట్లలో 75 శాతం... అంటే రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చినవే.

దివాలా చట్టం కింద ఎవరెవరిపై చర్యలు చేపట్టవచ్చో సూచించేందుకు రిజర్వు బ్యాంకు ఇటీవలే అంతర్గతంగా ఓ అడ్వైజరీ కమిటీని నియమించింది. దీన్లో అత్యధికులు ఆర్‌బీఐలోని స్వతంత్ర సభ్యులే. ఈ కమిటీ అన్నిటినీ పరిశీలించిందని, ఎలాంటి వివక్షకూ తావివ్వకుండా, అధ్యయనానంతరం ఈ నిర్ణయానికి వచ్చిందని బ్యాంకు తెలియజేసింది. ‘‘ఈ కమిటీ అన్ని ఖాతాలనూ పరిశీలించింది. 2016 మార్చి 31 నాటికి రూ.5వేల కోట్లు అంతకన్నా ఎక్కువ అప్పులుండి, వాటిలో 60 శాతానికి పైగా అప్పులు ఎన్‌పీఏలుగా మారిన పక్షంలో... అలాంటి ఖాతాల్ని ఈ దివాలా చట్టం కింద విచారించవచ్చని సూచించింది. కమిటీ సూచన మేరకు... ఆయా ఖాతాలపై దివాలా చట్టం కింద కేసులు పెట్టాల్సిందిగా మేం బ్యాంకులను కోరుతున్నాం’’ అని ఆర్‌బీఐ వివరించింది.

లా ట్రిబ్యునల్‌లో ప్రాధాన్యం
ఇలా బ్యాంకులు దివాలా కేసు పెట్టిన ఖాతాలపై విచారణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అధిక ప్రాధాన్యమిస్తుందని కూడా ఆర్‌బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ 12 ఖాతాలూ కాకుండా మిగిలిన ఎన్‌పీఏలకు సంబంధించి ఆరు నెలల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళికను తయారు చేయాల్సిందిగా కూడా రిజర్వు బ్యాంకు అడ్వైజరీ కమిటీ సిఫారసు చేసింది. ‘‘ఒకవేళ ఆయా ఖాతాలకు సంబంధించి ఆరు నెలల్లోగా ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరకకపోతే... ఆయా ఖాతాలపై కూడా దివాలా చట్టం కింద చర్యలు చేపడతాం’’ అని ఆర్‌బీఐ తెలియజేసింది.

టాప్‌–500 ఖాతాల్ని పరిశీలించాకే...
భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయి, స్ట్రెస్డ్‌ అసెట్స్‌ ఖాతాలుగా బ్యాంకులు గుర్తించిన 500 ఖాతాలను అడ్వైజరీ కమిటీకి ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆర్‌బీఐ తెలిపింది. ‘‘ఆ స్ట్రెస్డ్‌ రుణాల్లో చాలావాటిని బ్యాంకులు ఇప్పటికే ఎన్‌పీఏలుగా కూడా ప్రకటించేశాయి. వాటన్నిటినీ చూశాకే అడ్వైజరీ కమిటీ తాజా సిఫారసు చేసింది’’ అని ఆర్‌బీఐ వివరించింది.

నిజానికి ఈ 12 ఖాతాల పేర్లను ఆర్‌బీఐ గానీ, బ్యాంకులుగానీ వెల్లడించలేదు. కాకపోతే దేశవ్యాప్తంగా భారీగా రుణాల్లో కూరుకుపోయి, చాలావరకూ రుణాలను ఇప్పటికే ఎగ్గొట్టి స్ట్రెస్డ్‌ ఖాతాలుగా మారిన టాప్‌–14 సంస్థల వివరాలు పై బాక్స్‌లో చూడవచ్చు.

(విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ గ్రూప్‌పై ఇప్పటికే చర్యలు ఆరంభించిన నేపథ్యంలో దాన్ని ఈ జాబితాలో చేర్చలేదు)