రాజన్.. ఐదో‘సారీ’

3 Dec, 2014 00:33 IST|Sakshi
రాజన్.. ఐదో‘సారీ’

ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో వడ్డీరేట్లు యథాతథం
ఈఎంఐల భారం ఇప్పట్లో తగ్గే అవకాశం లేనట్లే!
రెపో 8 శాతం, రివర్స్ రెపో 7 శాతం, సీఆర్‌ఆర్ 4 శాతంగా కొనసాగింపు..
వచ్చే ఏడాది ఆరంభంలో రేట్లు తగ్గొచ్చని సంకేతం..
పారిశ్రామిక రంగం తీవ్ర అసంతృప్తి..

 
వడ్డీరేట్లు తగ్గించాలంటూ నలువైపుల నుంచీ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాత్రం దిగిరాలేదు. పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించారు. బ్యాంకర్లు కూడా రుణ రేట్లలో కోతకు ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. దీంతో గృహ, వాహన , ఇతరత్రా రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారాన్ని రుణ గ్రహీతలు ఇంకొన్నాళ్లు భరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, వచ్చే ఏడాది తొలినాళ్లలో రేట్ల కోత ఉండొచ్చంటూ ఆర్‌బీఐ సంకేతాలివ్వడం కాస్త సానుకూలాంశం.
 
ముంబై: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిర్ణయం వెలువడింది. మంగళవారం చేపట్టిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లలో మార్పుల్లేవని ప్రకటించింది. దీంతో కీలకమైన రెపో రేటు ఇప్పుడున్న 8 శాతం వద్ద, దీనికి అనుసంధానమైన రివర్స్ రెపో రేటు 7 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతం స్థాయిలో కొనసాగనున్నాయి. కాగా, పాలసీ రేట్లను రాజన్ యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఆర్‌బీఐ నిర్ణయంపై కార్పొరేట్ ఇండియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా రేట్లను తగ్గించమని చెబుతున్నా.. రిజర్వ్ బ్యాంక్ పట్టించుకోవడం లేదని కార్పొరేట్లు వ్యాఖ్యానించారు. మరోపక్క, తమ డిపాజిట్, రుణాలపై ప్రస్తుతానికి ఎలాంటి మార్పులూ చేయబోమని బ్యాంకర్లు పేర్కొన్నారు.

రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5.52 శాతానికి దిగిరావడం, టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం కూడా ఐదేళ్ల కనిష్టమైన 1.77 శాతానికి తగ్గడంతో ఈసారైనా ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందని పారిశ్రామిక రంగం గంపెడాశలు పెట్టుకుంది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు ఐదేళ్ల కనిష్టస్థాయికి పడిపోవడం(బ్యారెల్ 68 డాలర్లు) కూడా రేట్ల కోతకు సానుకూలాంశమని కార్పొరేట్లు వాదించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.3 శాతానికి(తొలి త్రైమాసికంలో 5.7%) తగ్గిన నేపథ్యంలో ఆర్‌బీఐ వృద్ధికి చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా మద్దతుగా మాట్లాడటం తెలిసిందే. అయితే, బ్యాంకర్లు, విశ్లేషకులు మాత్రం ప్రస్తుతానికి పాలసీ రేట్లు యథాతథంగానే ఉంటాయని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే రాజన్ నిర్ణయం వెలువడింది.

పాలసీ సమీక్షలో ఇతర ముఖ్యాంశాలివీ...
చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్) ఇప్పుడున్న 22 శాతం వద్దే కొనసాగుతుంది.
పస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో స్ధూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.5% ఉండొచ్చు.
2015 మార్చి చివరినాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా (గతంలో 8 శాతంగా అంచనా వేసింది). నవంబర్‌లో తగ్గే అవకాశం ఉన్నప్పటికీ... డిసెంబర్‌లో పుంజుకోవచ్చు.
పన్ను వసూళ్లు మందకొడిగా ఉన్న నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరడం (ఈ ఏడాది 4.1 శాతం) కష్టసాధ్యం కావచ్చు.
తదుపరి సమీక్ష 2015 ఫిబ్రవరి 3న జరుగుతుంది.
రుణ పునర్‌వ్యవస్థీకరణ నిబంధనల సడలింపు

మొండిబకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులకు రుణాల పునర్‌వ్యవస్థీకరణ నిబంధనలను సడలించనున్నట్లు రాజన్ చెప్పారు. ప్రస్తుతం రుణాల పునర్‌వ్యవస్థీకరణ జరిపే కంపెనీల్లో బ్యాంకులకు 10 శాతాన్ని మించి ఈక్విటీ వాటాను తీసుకోకుండా పరిమితి ఉంది. దీన్ని త్వరలోనే సాధ్యమైనంతమేర పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రాజెక్టులను గట్టెక్కించేందుకు తాజా రుణాలకు కూడా 5/25 నిబంధనను అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిప్రకారం ఏదైనా ఇన్‌ఫ్రా కంపెనీకి బ్యాంకులు 25 ఏళ్ల కాలపరిమితితో కొత్త రుణాలిచ్చేందుకు వీలవుతుంది.

ఈ రుణాన్ని ఐదేళ్ల తర్వాత వేరే బ్యాంకు/ఆర్థిక సంస్థకు బదలాయించుకోవడం లేదా రుణ ఒప్పందాలను మార్చుకోవడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి త్రైమాసికంలో చిన్న, పేమెంట్ బ్యాంకులకు లెసైన్స్‌లు జారీ చేసే అవకాశం ఉందని రాజన్ వెల్లడించారు. ఇటీవలే దీనికి సంబంధించి తుది మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్‌బీఐ.. ఔత్సాహిక సంస్థలు, వ్యక్తులు లెసైన్స్‌లకు దరఖాస్తు చేసుకోడానికి 2015 జనవరి 16ను ఆఖరి తేదీగా నిర్ధేశించింది కూడా.

రేట్ల తగ్గింపునకు ఇది సమయం కాదు: రాజన్
ఆర్‌బీఐ పాలసీ ధోరణిలో మార్పునకు(రేట్ల కోత) ఇది తగిన సమయం కాదని గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘ద్రవ్యోల్బణం ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగి.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగపడితే(ద్రవ్యలోటుకు అడ్డుకట్ట పడితే) వచ్చే ఏడాది ఆరంభంలోనే రేట్ల తగ్గింపునకు అవకాశం ఉంది. పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా కూడా నిర్ణయం తీసుకుంటాం’ అని రాజన్ చెప్పారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం అంచనాలు, ధోరణి ఆధారంగా ఆర్‌బీఐ విధానం ఉంటుంది. అంతేకానీ, ఒక సమీక్షలో రేట్లను తగ్గించడం.. తర్వాత వెంటనే మళ్లీ పెంపు.. ఇలాంటి దోబూచుల పద్ధతిని తాము అనుసరించబోమని పేర్నొన్నారు.

మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధికి చేయూతనివ్వాలన్న విజ్ఞప్తులను ఆర్‌బీఐ పట్టించుకోవడం లేదన్న కార్పొరేట్ల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇదంతా వాళ్ల దురభిప్రాయమని తేల్చిచెప్పారు. ‘పారిశ్రామిక వర్గాలు దూరదృష్టితో కాకుండా సంకుచిత ధోరణితో ఆలోచిస్తున్నాయి. ఆర్‌బీఐ వృద్ధికి వ్యతిరేకం కాదు. ఎల్లప్పుడూ సాధ్యమైనంతమేరకు పటిష్టమైన వృద్ధినే కోరుకుంటుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కూడా మా బాధ్యత. లేదంటే అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన పరిస్థితులు మళ్లీమళ్లీ చోటుచేసుకుంటాయి’ అని రాజన్ పేర్కొన్నారు. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం రానున్న కాలంలో మరింత తగ్గుముఖం పట్టే అవశాలున్నాయని.. వచ్చే 12 నెలల వ్యవధిలో సగటున 6 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. 2016 జనవరి నాటికి.. ఆతర్వాత కాలంలో 4% (2% అటూఇటూగా) లక్ష్యాన్ని నిర్దే శించుకుంటున్నామన్నారు. ప్రస్తుత లక్ష్యం 6%.
 
ఒక్క బంగారంలోనే పెట్టుబడి పెట్టొద్దు...
బంగారం దిగుమతులపై సుంకంలో ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉందని రాజన్ సంకేతాలిచ్చారు. పుత్తడి దిగుమతులకు అడ్డుకట్టకోసం ప్రభుత్వం సుంకాన్ని 10%కి పెంచడం తెలిసిందే. పసిడి దిగుమతుల నియంత్రణకు అమలు చేసిన 80:20 స్కీమ్‌వల్ల పెద్దగా ఉపయోగం లేనందువల్లే ప్రభుత్వం రద్దు చేసినట్లు చెప్పారు. దిగుమతి చేసుకున్న బంగారంలో కనీసం 20 శాతాన్ని ఎగుమతి చేసిన తర్వాతే తదుపరి దిగుమతులకు అనుమతించడమనేది ఈ 80:20 స్కీమ్ ఉద్దేశం. ఇన్వెస్టర్లు ఒక్క బంగారానికే తమ పెట్టుబడులన్నీ కేటాయించవద్దని.. ఇతర ఆర్థిక సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేయాలని రాజన్ సూచించారు.
 
వృద్ధికి ఆర్‌బీఐ సహకరించట్లేదు: కార్పొరేట్లు
మందగమనంలో ఉన్న వృద్ధిని గాడిలో పెట్టేందుకు ఆర్‌బీఐ సహకరించడంలేదని పారిశ్రామిక రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇబ్బందుల్లో ఉన్న తయారీ రంగానికి వడ్డీరేట్ల కోతతో ఉపశమనం కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. వచ్చే పాలసీ సమీక్ష కంటే ముందే రేట్ల తగ్గింపు ద్వారా వృద్ధికి చేయూతనిస్తుందని భావిస్తున్నట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ నిర్ణయం నిరాశ పరిచిందని రియల్టర్ల సంఘం క్రెడాయ్ ప్రెసిడెంట్ సి.శేఖర్ రెడ్డి అన్నారు. గృహ నిర్మాణ రంగంలో డిమాండ్ లేకపోగా వ్యయాలు మాత్రం భారీగా పెరిగాయని చెప్పారు. చౌక గృహాలకు డిమాండ్ పెంచేందుకు వీలుగా వడ్డీరేట్లలో రాయితీ, పన్నుల తగ్గింపు రూపంలో తమకు ప్రభుత్వం సహాయ ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
వడ్డీ రేట్లు తగ్గించం: బ్యాంకర్లు
ఆర్‌బీఐ అనుసరించిన యథాతథ విధానాన్నే తామూ అమలు చేస్తామని బ్యాంకర్లు పేర్కొన్నారు. రుణాలు అదేవిధంగా డిపాజిట్లపైన కూడా వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాల్లేవని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. కాగా, వచ్చే మార్చి నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 6 శాతానికి కుదించడం చూస్తే.. సరళ పాలసీవైపు ఆర్‌బీఐ అడుగులేస్తోందనేందుకు నిదర్శనమన్నారు. అధిక  వడ్డీ రేట్లకు బ్యాంకులే కారణమని, మనీ మార్కెట్ ద్వారా పొందే ప్రయోజనాలను అవి ఖాతాదారులకు బదిలీ చేయడం లేదంటూ రాజన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. మనీ మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం చాలా స్వల్పమే కావడం వల్ల బదలాయించేంత స్థాయిలో ప్రయోజనాలేమీ బ్యాంకులకు ఒనగూరవని చెప్పారు. కాగా, అధిక మొండిబకాయిల కారణంగా బ్యాంకుల మార్జిన్లు తగ్గుతున్నాయని.. ప్రస్తుతానికైతే వడ్డీరేట్ల కోతకు ఆస్కారం లేదని యునెటైడ్ బ్యాంక్ ఈడీ దీపక్ నారంగ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు