RBI Governor Shaktikanta Das: అధికరేటు ఎప్పటివరకో... కాలమే చెప్పాలి

21 Oct, 2023 01:18 IST|Sakshi

 గవర్నర్‌ శక్తికాంతదాస్‌  

న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు కొంతకాలం అధిక స్థాయిలోనే ఉంటాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఎంతకాలం ఈ స్థితి కొనసాగుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు. కౌటిల్య ఎకనామిక్‌ కాన్‌క్లేవ్, 2023లో ఆయన ఈ మేరకు ఒక ప్రసంగం చేస్తూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ జాగరూకతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.  ఈ అంశాన్ని ‘ఏకాగ్రతకు సంబంధించి అర్జునిడి కన్ను’’తో పోల్చారు.

భారత్‌లో ద్రవ్యోల్బణానికి సంబంధించి ‘అంతర్జాతీయ ఇంధన ధరలే’ ప్రధాన సవాలుగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌–గాజా సంఘర్షణ అమెరికాసహా ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లోనూ భారత్‌ పటిష్ట ఆర్థిక పరిస్థితులను కలిగి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. భారత్‌ రూపాయి విలువ డాలర్‌ మారకంలో తీవ్ర ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రూ. 2,000 నోట్లు తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు.

వ్యవస్థలో రూ. 10,000 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ మొత్తం కూడా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇదిలావుండగా, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని గవర్నర్‌ నేతృత్వంలో ఈ నెల మొదట్లో జరిగిన ఆరుగురు సభ్యుల ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయించినట్లు  ఆ భేటీకి సంబంధించి తాజాగా వెలువడిన మినిట్స్‌ పేర్కొంది. ఫిబ్రవరి తర్వాత వరుసగా నాలుగు సమీక్షా సమావేశాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఆర్‌బీఐ యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై రాజీలేని వైఖరి అవలంభిస్తామని తద్వారా కమిటీ స్పష్టం చేస్తోంది. 

మరిన్ని వార్తలు