ఆర్‌బీఐ పాలసీవైపు చూపు

2 Feb, 2015 04:05 IST|Sakshi
ఆర్‌బీఐ పాలసీవైపు చూపు

- వడ్డీ రేట్లపై నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ కదలికలు
- ఆటో, సిమెంట్ కంపెనీల డేటా ప్రభావం
- క్యూ 3 ఫలితాల ఎఫెక్ట్ కూడా

ముంబై: ఆర్‌బీఐ పాలసీ సమీక్షతోపాటు ఆటోమొబైల్, సిమెంటు కంపెనీల అమ్మకాల డేటా, కొన్ని ముఖ్య కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు ఈ వారం మార్కె ట్ ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి మారకపు విలువ కదలికలు, ముడి చమురు ధర తదితర అంశాలూ ట్రేడింగ్‌ను శాసిస్తాయని వారు అంటున్నారు. నెలారంభంలో ఆటోమొబైల్ కంపెనీలు, సిమెంటు కంపెనీలు విడుదలచేసే వాటి నెలవారీ అమ్మకాల గణాంకాలకు అనుగుణంగా ఆయా షేర్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని క్యాపిటల్‌వయా రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఫిబ్రవరి 3న ఆర్‌బీఐ నిర్వహించే పరపతి విధాన సమీక్ష ఈ వారం మార్కెట్‌కు ప్రధానమైనదని, కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతుందని తాను అంచనావేస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
ఇక ఈ వారం ఏసీసీ, హీరో హోండా, జిందాల్ స్టీల్ అండ్ పవర్, లుపిన్, ఎన్‌హెచ్‌పీసీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అరబిందో ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, టాటా పవర్, టాటామోటార్స్, ఎన్‌ఎండీసీ, టాటా స్టీల్ కంపెనీలు మూడవ త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు కూడా రానున్న ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. ఈ ఫలితాలతో పాటు ప్రపంచ మార్కెట్ల సంకేతాలు, ముడి చమురు ధర, డాలరుతో రూపాయి ట్రెండ్‌ను భారత్ సూచీలను ప్రభావితం చేస్తాయని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధాకన్ చెప్పారు.

మరిన్ని వార్తలు