కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి

11 Nov, 2023 13:02 IST|Sakshi

భారతదేశ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఉద్యోగ డిమాండ్‌ను తీర్చడానికి మాత్రం వృద్ధి రేటు ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌ స్పష్టం చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం 6-6.5 శాతం ఆర్థిక వృద్ధి నమోదు చేస్తోందని, కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఇది సరిపోదని అన్నారు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషిస్తూంటారన్నది మనకు తెలిసిన విషయమే. మరోవైపు భారత్‌లో ఏటా నిరుద్యోగం పెరుగుతోంది. దీనికి తోడు ఏటా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నవారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా దేశం ఏ మేరకు వృద్ధి సాధించాలో ఆయన తన అంచనాలను వెల్లడించారు. 

‘జనాభా అవసరాలు తీర్చాలన్నా.. కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నా భారతదేశం 8-8.5 శాతం ఆర్థికవృద్ధి సాధించాలి. ఉత్పాదకతలో చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడాలి. అందుకు అవసరమయ్యే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఐఫోన్‌ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులను దేశంలో తయారు చేస్తున్నారు. కానీ వీటి విడిభాగాలు తయారీలో దేశం పురోగతి చెందింది. అయితే పూర్తి స్థాయి సామర్థ్యాలను సాధించడంలో మాత్రం ఇంకా వృద్ధి చెందాలి’ అని రఘురామ్‌రాజన్‌ అన్నారు.

ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధ్రువ్ శర్మ ఇటీవల మాట్లాడుతూ 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దాదాపు ఏటా 8 శాతం ఆర్థికవృద్ధి నమోదు చేయాలని సూచించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.  ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం, ఇతర నియంత్రణ చర్యల వల్ల కొవిడ్‌ తర్వాత దేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఏటా ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటునట్లు నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 10.05 శాతానికి చేరుకుందని ముంబైలోని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలిపింది. రాబోయే దశాబ్దంలో దేశంలో ఏడు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హెచ్‌ఎస్‌బీసీ సూచిస్తుంది. 
 

మరిన్ని వార్తలు