భారత్‌లో టెస్లా.. ఎలాన్‌ మస్క్‌తో పియూష్‌ గోయల్‌ భేటీ!, ఎప్పుడంటే?

11 Nov, 2023 12:24 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో నవంబర్‌ 13 నుంచి 17 వరకు ఇండో-పసిపిక్‌ ఎకనామిక్స్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఐపీఈఎఫ్‌) సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికాలో పర్యటించనున్నారు. 

ఈ తరుణంలో పియూష్‌ గోయల్‌.. ఎలాన్‌ మస్క్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీలో భారత్‌లో టెస్లా పెట్టుబడులు, కార్ల తయారీ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 

ప్రస్తుతం చైనా - అమెరికా దేశాల మధ్య వైరం తారా స్థాయికి చేరింది. దీంతో డ్రాగన్‌ దేశంలో వ్యాపారం చేయడం ఏమాత్రం మంచిది కాదేమోనన్న అభిప్రాయానికి వచ్చిన పలు అంతర్జాతీయ సంస్థలు సకల సౌకర్యాలు కలిగిన భారత్‌ అయితేనే తమకు అన్నీ విధాల ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాయి. మస్క్‌ సైతం భారత్‌లో అడుగు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా టెస్లా కార్ల తయారీ, అమ్మకాలు భారత్‌లో జరుపుకునేలా మస్క్‌ను పియూష్‌ గోయల్‌ భారత్‌కు ఆహ్వానించనున్నారు. 

భారత్‌లో టెస్లా
ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఉన్న మోదీతో మస్క్‌ భేటీ అయ్యారు. భేటీ అనంతరం వీలైనంత త్వరగా భారత్‌లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే యోచనలో ఉన్నట్లు మస్క్‌ తెలిపారు. సాధ్యమైనంత త్వరలో భారత్‌లో టెస్లా ప్రవేశం ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నుంచి మంచి సహకారం లభిస్తోందన్నారు. టెస్లా కార్లతో పాటు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ స్టార్‌లింక్‌ సేవల్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకొస్తామని ఆ సమయంలో  వెల్లడించారు.

ఈ నేపథ్యంలో అమెరికాతో భారత్ ఆర్థిక సంబంధాలకు ఊతమిచ్చేందుకు, పెట్టుబడులను పెంచేందుకు బహుళ జాతి కంపెనీల సీఈవోలు, స్టార్టప్ కమ్యూనిటీ, ఇతర వ్యాపార వేత్తలతో పియూష్‌ గోయల్‌ భేటీ కానుండగా.. వారిలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు