రిలయన్స్ ఇన్‌ఫ్రా చేతికి పిపావవ్ డిఫెన్స్

5 Mar, 2015 01:11 IST|Sakshi
రిలయన్స్ ఇన్‌ఫ్రా చేతికి పిపావవ్ డిఫెన్స్

- రూ. 2,082 కోట్ల మేర డీల్ విలువ
- తొలుత 18 శాతం వాటాల కొనుగోలు
- తర్వాత  మరో 26% వాటాలకు ఓపెన్ ఆఫర్
- లావాదేవీ పూర్తయ్యాక రిలయన్స్  డిఫెన్స్‌గా పేరు మార్పు
- చైర్మన్‌గా అనిల్ అంబానీ



న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాజాగా దేశీ రక్షణ రంగంలో అతి పెద్ద డీల్‌కు తెర తీసింది. పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 2,082.3 కోట్ల మేర ఉండనుంది. ఒప్పందం కింద పిపావవ్ డిఫెన్స్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రా ఒక్కో షేరుకు రూ. 63 వెచ్చించి 18 శాతం వాటాలు కొనుగోలు చేస్తుంది.

ఇందుకోసం సుమారు రూ. 819 కోట్లు అవుతుంది. ఇక, ఆ తర్వాత షేరుకి రూ. 66 చొప్పున అదనంగా 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తుంది. దీనికి రూ. 1,263.3 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓపెన్ ఆఫర్‌కి స్పందన లేకపోయిన పక్షంలో ప్రమోటర్ల దగ్గర్నుంచే అదనంగా 7.1 శాతం వాటాలను కొనుగోలు చేస్తుంది. తద్వారా మొత్తం మీద 25.10 శాతం వాటాలు దక్కించుకోనుంది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ డీల్ పూర్తి కానుంది. ప్రస్తుతం రుణాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో ఉన్న పిపావవ్ డిఫెన్స్‌లో ప్రమోటర్లకు 44.50 శాతం వాటాలు ఉన్నాయి.
 
ఇక మైనారిటీ వాటాదార్లుగా ప్రమోటర్లు..
లావాదేవీ పూర్తయిన తర్వాత పిపావవ్ డిఫెన్స్ ప్రస్తుత ప్రమోటర్లు.. మైనారిటీ వాటాదార్లుగా ఉంటారు. ప్రమోటర్లకు సంబంధించి కంపెనీ బోర్డులో ఇద్దరు నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉంటారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యాక సంస్థ పేరు రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌గా మారుతుంది. సంస్థ చైర్మన్‌గా అనిల్ అంబానీ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములు అయ్యేందుకు ఈ కొనుగోలు ఉపకరించగలదని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. దాదాపు పదేళ్ల క్రితం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తాజా పరిణామం దోహదపడగలదని పిపావవ్ డిఫెన్స్ వ్యవస్థాపక ప్రమోటర్, చైర్మన్ నిఖిల్ గాంధీ చెప్పారు. రోడ్లు, మెట్రో రైలు, సిమెంటు తదితర రంగాల్లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు