రేషనుకూ అదే ముద్ర

5 Mar, 2015 01:11 IST|Sakshi

లబ్ధిదారులకు రేషన్ కష్టాలు
వేలిముద్ర వేసినోళ్లకే సరకులు
వచ్చే నెల నుంచి ఈ-పాస్ విధానం అమలు

 
రేషను విడిపించుకోవాలంటే కొత్త చిక్కొచ్చిపడింది. ఇప్పటికే రకరకాల సాకులతో రేషను కార్డులకు కోత విధించిన సర్కారు తాజగా మరో నిబంధన అమలులోకి తేనుంది. రేషనుడీలరు సరకులివ్వాలంటే కార్డుహోల్డరు వేలిముద్ర వేయాల్సిందే. వేలిముద్ర ఏమాత్రం తేడా వచ్చిన రేషనుకు ఎసరే. ఏప్రిల్ నుంచి రాష్ర్ట ప్రభుత్వం ఈ నియమాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. అధికారవర్గాలు దీనిని ధ్రువీకరించాయి. బయోమెట్రిక్ విధానం కింద పించనుకు అగచాట్లు పడుతున్న నేపథ్యంలో రేషనుకూ అదేతరహా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కాకుంటే ఇది ఈ-పాస్ విధానమని అధికారులు సమర్దించుకుంటున్నారు.
 
మహారాణిపేట: బయోమెట్రిక్‌తో పింఛనుదార్లను అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వం ఆ బాధను రేషన్ దుకాణాలకూ వర్తింపజేయనుంది. ఈ-పాస్ విధానాన్ని అమలు చేసి ఇకమీదట వేలిముద్రలు వేసిన వారికే రేషన్ ఇవ్వనున్నారు. వచ్చే నెల నుంచి దీనిని అమలుచేయనున్నారు. దీని ప్రకారం నేరుగా కార్డుదారుడే రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి. అదీ డివైస్ ఎలక్ట్రానిక్ మిషన్‌పై వేలిముద్రలు పడితేనే. లేదంటే ఆ కార్డుకు రేషన్ నిలిపివేస్తారు. గతంలో ఒకరి కార్డు ఇంకొకరు తీసుకువెళ్లినా రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు అది కుదరదు. కచ్చితత్వం కోసం ప్రవేశపెడుతున్న ఈ పద్ధతి చాలామందికి ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ఈ పాస్ విధానం అమలైతే  గామాల్లో ఒంటరిగా ఉన్న ముసలివారు పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటికే వారు పెన్షన్ల కోసం నానా యాతన పడుతున్నారు. జియోట్యాపింగ్ మిషన్లపై ముసలివారి వేలిముద్రలు పడకపోవడం, వారు వేసే సమయానికి సిగ్నల్ పనిచేయకపోవడం తదితర సమస్యలతో అర్హులైన వారికి పింఛన్లు నిలిపివేస్తున్నారు. ఇప్పుడు రేషన్ దుకాణాల్లో కూడా కష్టాలు మొదలు కానున్నాయి. జిల్లాలో 2012 చౌకధరల దుకాణాలుండగా మొదటి విడతగా జిల్లాకు 686 ఈ పాస్ మిషన్లు, డీ వైస్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం టెర్రాస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 31 మిషన్లు పౌరసరఫరాల అధికారి కార్యాలయానికి చేరాయి. మొదటి విడతలో నగర పరిధిలోని భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలు, పెందుర్తి, రూరల్ పరిధిలోని యలమంచిలి మున్సిపాలిటీ, అ న్ని మండలాల్లో ఈ పద్ధతిని అమలు చేయనున్నారు. డీలర్లకు ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు పౌరసరఫరాాల అధికారులు శిక్షణ నిర్వహిస్తారు. జిల్లా లో 10 లక్షల 76 వేల119 రేషన్ కార్డులున్నాయి. ఇందులో నగర పరిధిలో 3 లక్షల 38 వేల729 కార్డులు కాగా, రూరల్లో 7 లక్షల 37 వేల 390 కార్డులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు