స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

12 Dec, 2023 05:48 IST|Sakshi

రూ.2 లక్షల కోట్లకు నిర్వహణ ఆస్తులు

ఏడాది కాలంలో 69% పెరుగుదల

న్యూఢిల్లీ: స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నిరంతరాయంగా, బలంగా వస్తూనే ఉన్నాయి. దీంతో అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల పరిధిలోని స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) నవంబర్‌ చివరికి రూ.2.2 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ ఏయూఎంలో 69 శాతం వృద్ధి కనిపిస్తోంది. అక్టోబర్‌ నెల స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ ఏయూఎంతో పోల్చి చూసినా కానీ, 10 శాతం వృద్ధి నమోదైంది.

2019–20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ ఏయూఎం అనూహ్యమైన వృద్ధిని చూసినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో అనుకూల వాతావరణం, బారీ పెట్టుబడుల రాక ఇందుకు దోహదం చేసింది.

ఈ ఏడాది ఆరంభం నుంచి నవంబర్‌ వరకు స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ నికరంగా రూ.37,178 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇందులో అత్యధికంగా అక్టోబర్‌లో రూ.4,495 కోట్లు వచ్చాయి. మరోవైపు ఈ ఏడాది 11 నెలల్లో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,688 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంటే స్మాల్‌క్యాప్‌ కంపెనీల విషయంలో దేశీ ఇన్వెస్టర్లు ఎంతో బుల్లిష్ గా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.   

పెట్టుబడులపై పరిమితులు
చిన్న కంపెనీల్లోకి గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు రావడంతో షేర్ల ధరలను గణనీయంగా పెరిగేందుకు దారితీస్తోంది. ‘‘పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు గడిచిన త్రైమాసికంలో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాకపై పరిమితులు విధించాయి. పెట్టుబడులు గణనీయంగా రావడం, కంపెనీల వ్యాల్యూషన్లు ఖరీదుగా మారడం ఫండ్‌ మేనేజర్లను ఆందోళనకు గురి చేస్తోంది’’అని మారి్నంగ్‌ స్టార్‌ ఇండియా తన త్రైమాసికం వారీ నివేదికలో పేర్కొంది.

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు సంబంధించిన ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) సైతం 62 లక్షలు పెరిగి నవంబర్‌ చివరికి 1.6 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇవి 97.52 లక్షలుగా ఉన్నాయి. సెబీ నిబంధనల ప్రకారం స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ కనీసం 65 శాతం పెట్టుబడులను స్మాల్‌క్యాప్‌ కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. స్వల్పకాలంలో ఉండే అనిశి్చతుల దృష్ట్యా ఇన్వెస్టర్లు స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టుకోవాలని యూనియన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఈవో జి.ప్రదీప్‌ కుమార్‌ సూచించారు.

>
మరిన్ని వార్తలు