ఎఫ్‌పీఐల దూకుడు

12 Dec, 2023 05:39 IST|Sakshi

ఆరు రోజుల్లో రూ.26,505 కోట్ల కొనుగోళ్లు

రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మార్పు

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీల పట్ల దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు సాగిస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు, ఈ నెలలో మాత్రం భారీ పెట్టుబడులకు మొగ్గు చూపించారు. డిసెంబర్‌ నెలలో మొదటి ఆరు ట్రేడింగ్‌ రోజుల్లో (8వ తేదీ నాటికి) ఏకంగా రూ.26,505 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు.

ఇటీవల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండడం, మూడు రాష్ట్రాల్లో బీజేపీ బంపర్‌ మెజారిటీ సాధించడంతో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగుతుందన్న స్పష్టత ఎఫ్‌పీఐల్లో సానుకూలతకు దారితీసింది. అక్టోబర్‌ నెలలోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఆగస్ట్, సెపె్టంబర్‌ నెలలో రూ.39,300 కోట్ల మేర పెట్టుబడులను వారు ఉపసంహరించుకోవడం గమనార్హం.

ఇక మీదట ఎఫ్‌పీఐల పెట్టుబడులు కొనసాగుతాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందన్న సంకేతాల ఫలితమే ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారీగా రావడానికి కారణమని ఫిడెల్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్‌ వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ పేర్కొన్నారు. ‘‘2024 సాధారణ ఎన్నికల అనంతరం రాజకీయ స్థిరత్వం, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యోల్బణం తగ్గడం, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ స్థిరంగా తగ్గుతూ వస్తుండడం, బ్రెండ్‌ క్రూడ్‌ ధరల్లో దిద్దుబాటు భారత్‌కు అనుకూలించే అంశాలు’’అని విజయ్‌ కుమార్‌ వివరించారు.

వీటిల్లో పెట్టుబడులు  
‘‘వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి రేట్ల కోత ఉంటుందని యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతం ఇవ్వడం, అధిక వడ్డీ రేట్ల వాతావరణం నుంచి మళ్లనున్నట్టు సూచించడమే అవుతుంది. దీంతో ఇతర కరెన్సీలతో యూఎస్‌ డాలర్‌ బలహీనపడడం మొదలైంది’’అని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్‌ ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌ క్షీణించడంతో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో ఉన్న రిస్‌్క–రాబడుల తీరును తిరిగి మదించడానికి దారితీసినట్టు చెప్పారు. బ్యాంకులు, ఐటీ, టెలికం, ఆటోమొబైల్, క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీల్లో ఎఫ్‌పీఐల కొనుగోళ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో రూ.1.31 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా, డెట్‌ మార్కెట్లో రూ.55,867 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

>
మరిన్ని వార్తలు