‘రెట్రోస్పెక్టివ్’ పన్నుకు ఇక చెల్లు!

25 Jan, 2016 00:08 IST|Sakshi
‘రెట్రోస్పెక్టివ్’ పన్నుకు ఇక చెల్లు!

భారత్-ఫ్రాన్స్ వ్యాపార సదస్సులో ప్రధాని మోదీ హామీ
ఆ విధమైన పన్నుల విధానం ఇకపై ఉండబోదని స్పష్టీకరణ

చండీగఢ్: భారత్‌లో రెట్రోస్పెక్టివ్ పన్నుల విధానం(పాత ఒప్పందాలకూ పన్నుల వర్తింపు) ఇక గతించిన అంశమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విధమైన పన్నుల విధింపు అనేది ఇక్కడ మళ్లీ ఎప్పుడూ ఉండబోదని హామీనిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పర్యటన సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన భారత్-ఫ్రాన్స్ వ్యాపార సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు.

వొడాఫోన్ పన్ను కేసు ఇతరత్రా ఇటువంటివే మరికొన్ని అంశాల కారణంగా భారత్‌లో స్థిరమైన పన్నుల విధానం లేదంటూ విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోదీ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మరో 15 ఏళ్లపాటు భారత్‌లో సుస్థిరమైన పాలన, స్థిరమైన పన్నుల వ్యవస్థ ఉంటుంది. ఇదే విషయాన్ని ఈ సదస్సు సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్లందరికీ స్పష్టం చేస్తున్నా. మా ప్రభుత్వం సరళతరమైన, స్థిరమైన పన్నుల విధానానికి కట్టుబడి ఉంది. రెట్రోస్పెక్టివ్ పన్ను అనేది ఇక గతం. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటిది పునరావృతం కాదు.

మా ప్రభుత్వమే కాదు భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధానమైన పన్నుల విధింపు జోలికివెళ్లవని హామీనిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లందరికీ.. రానున్న ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లలో ఎలాంటి పన్నుల విధానం అమలవుతుందనేది స్పష్టంగా తెలుస్తుందని కూడా ఆయన వివరించారు. ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో పాటు ఆ దేశానికి చెందిన దిగ్గజ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు.

డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టండి...
భారత్‌లో చౌక ఉత్పాదక వ్యయాన్ని అవకాశంగా మలచుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ప్రధానంగా తయారీకి సంబంధించి డిఫెన్స్ రంగంలో అపార  వ్యాపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ‘రక్షణ దళాలకు సంబంధించి డిఫెన్స్ తయారీ రంగాన్ని భారత్ ప్రోత్సహిస్తోంది. ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా మీకు(ఫ్రెంచ్ కంపెనీలు) అన్నివిధాలుగా సహకారం అందిస్తాం’ అని మోదీ వివరించారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) భారత్ అత్యంత ప్రధానమైన గమ్యంగా అవతరించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే వ్యాపారాలకు సానుకూల దేశాల ర్యాంకింగ్‌లో భారత్ 12 స్థానాలు ఎగబాకింది. స్వల్పకాలంలోనే ఎఫ్‌డీఐలు 40 శాతం ఎగబాకడం దీనికి నిదర్శనం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుపరిపాలన దిశగా మేం చర్యలు తీసుకుంటున్నాం. ఇవే ప్రపంచాన్ని భారత్‌వైపు ఆకర్షిస్తున్నాయి’ అని ప్రధాని తెలిపారు.

మేడ్ ఫర్ ఈచ్ అదర్...
భారత్, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాన్ని ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’గా మోదీ అభివర్ణించారు. ‘అనేక రంగాల్లో ఇరు దేశాలు సమష్టిగా పనిచేసేందుకు అవకాశాలున్నాయి. మీకు(ఫ్రాన్స్) ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఇతరత్రా అంశాలు మాకు అవసరం. మా దగ్గరున్న అపారమైన మార్కెట్ మీకు అవసరం’ అని మోదీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వే నెట్‌వర్క్ ఆధునీకరణకు సహకారం అందించాల్సిందిగా మోదీ ఫ్రాన్స్‌ను కోరారు.

భారత్ అభివృద్ధి విధానానికి ఫ్రాన్స్ నైపుణ్యం అవసరమని చెప్పారు. భూతాపోన్నతి(గ్లోబల్ వార్మింగ్)ని తగ్గించే విషయంలో చేస్తున్న ప్రయత్నాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని కోరుకుంటోందని కూడా ఈ సందర్భంగా మోదీ వివరించారు. రైల్వేలో డీజిల్ ఇంజిన్ల స్థానంలో భవిష్యత్తులో ఇక ఎలక్ట్రిక్ ఇంజిన్లను ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

 పన్ను వివాదాల పరిష్కారంలో వినూత్న విధానాలు: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలో వ్యాపారం నిర్వహణకు సంబంధించి ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్ (ప్రపంచబ్యాంక్ 2016 నివేదిక ప్రకారం 130) మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రెండురోజుల కార్యక్రమాన్ని ఆదివారం నాడు ఇక్కడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వినూత్న పన్ను వివాద వ్యవస్థ ద్వారా ఈ వివాదాలు పెరక్కుండా చూడాలని సూచించారు. తద్వారా ఈ అంశాన్ని దేశ వృద్ధి బాటలో ఒక భాగంగా మలిచే చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు