అంచనాలకు అనుగుణంగా ఆర్‌ఐఎల్‌ ఫలితాలు

17 Jan, 2019 19:51 IST|Sakshi

సాక్షి, ముంబై : ముఖేష్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఈ క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ 10,251 కోట్లుగా నమోదైంది. సంస్ధ రాబడి 55.9 శాతం పెరిగి రూ 1,71,336 కోట్లకు చేరింది. పన్నులకు ముందు లాభం 9.3 శాతం పెరిగి రూ 14,445 కోట్లుగా నమోదైంది. మూడో త్రైమాసికంలో కంపెనీ అన్ని విభాగాల్లోనూ సంతృప్తికర ఫలితాలను సాధించిందని ఆర్‌ఐఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 


రూ 10,000 కోట్లు దాటిన జియో రాబడి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్‌ జియో కీలక విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. నిర్వహణ రాబడి రూ 10,383 కోట్లు కాగా నికర లాభం 65 శాతం వృద్ధితో రూ 831 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జియో రూ 504 కోట్ల నికర లాభం ఆర్జించింది.

అంచనాలకు మించి జియో ప్రస్ధానం అత్యద్భుతంగా సాగుతోందని, 28 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లతో జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్‌ డేటా నెట్‌వర్క్‌గా ఆవిర్భవించిందని ఆర్‌ఐఎల్‌ సీఎండీ ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో అత్యుత్తమ నాణ్యతతో ప్రతిఒక్కరికీ చేరువ కావాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా జియో పయనం సాగుతోందన్నారు. 

మరిన్ని వార్తలు