విస్తారా ప్రయాణికులకు రోబో సేవలు!!

30 May, 2018 01:52 IST|Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘విస్తారా’... ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలోని తన లాంజ్‌లో రోబో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది ప్రయాణికుల సందేహాలను పరిష్కరిస్తుంది. బోర్డింగ్‌ పాస్‌లను స్కాన్‌ చేస్తుంది. ఫ్లైట్‌ స్టేటస్‌ను తెలియజేస్తుంది.

ప్రయాణికులు వెళ్లే ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేస్తుంది. అలాగే వారిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. నిర్దేశించిన దారిలో అటు ఇటు తిరుగుతూ ప్రయాణికులను పలకరించగలదు. ఇన్ని సేవలందించే ఈ రోబోకు కంపెనీ.. ‘రాడా’ అనే పేరు పెట్టింది. తమ రోబో... సాంగ్స్‌ను కూడా ప్లే చేయగలదని విస్తారా తెలిపింది.

ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ టర్మినల్‌–3లోని తమ సిగ్నేచర్‌ లాంజ్‌లో జూలై 5 నుంచి రోబోను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. రోబో విషయానికి వస్తే.. దీనికి కింద 4 వీల్స్‌ ఉంటాయని, 360 డిగ్రీల్లో చుట్టూ తిరగగలదని, 3 ఇన్‌–బిల్ట్‌ కెమెరాలు అమర్చామని, సమర్థవంతమైన వాయిస్‌ టెక్నాలజీ పొందుపరిచామని వివరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రోబోను తయారుచేసినట్లు పేర్కొంది. విస్తారా అనేది టాటా సన్స్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ జాయింట్‌ వెంచర్‌.     

మరిన్ని వార్తలు