నాణ్యతతోనే ఉన్నత స్థానానికి

29 Sep, 2023 05:02 IST|Sakshi

నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు కీలకం

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అత్యుత్తమ నాణ్యతా ఉత్పత్తులు, సేవలు సాయపడతాయని కేంద్ర వాణిజ్య, ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ప్రమాణాలు అనేవి పటిష్టమైన వ్యవస్థకు మద్దతుగా నిలవాలన్నారు. వీటిని భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల తర్వాతే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) వర్క్‌షాప్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశ వాణిజ్యం, ఎగుమతులకు ప్రమాణాలు అనేవి మూలస్తంభంగా పేర్కొన్నారు.

ఆవిష్కరణలు, సామర్థ్యం జాతీయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయన్నారు. సుస్థిరత, నకిలీ ఉత్పత్తుల కట్టడి, ఎంఎస్‌ఎంఈలకు మద్దతు, స్టార్టప్‌లు మరింత పోటీనిచ్చేందుకు వీలుగా.. ప్రమాణాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఐఎస్‌ సాంకేతిక కమిటీ సభ్యులపై ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉండేలా చూడాలని కోరారు. అప్పుడే ప్రపంచానికి తయారీ కేంద్రంగా, స్వావలంబన భారత్‌గా మారాలన్న స్వప్నం సాకారమవుతుందన్నారు. బీఐఎస్‌లో 400 స్టాండింగ్‌ కమిటీలు భారత ప్రమాణాల రూపకల్పన బాధ్యతను చూస్తుంటాయి.

మరిన్ని వార్తలు