సారేగామా షేరు.. లాభాల ట్యూన్‌

4 Jun, 2020 13:39 IST|Sakshi

ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ సారేగామా  ఇండియా షేర్లు వరుసగా రెండో రోజు అప్పర్‌ సర్యూట్‌ను తాకాయి. గురువారం బీఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం పెరిగి రూ.401 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలకు మ్యూజిక్‌ అందించే ఒప్పందాన్ని ఫేస్‌బుక్‌తో చేసుకున్నట్లు సారేగామా  ఇండియా గురువారం ప్రకటించడంతో ఈ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. గత రెండు సెషన్లలో ఈ షేర్లు 44 శాతం పెరగడంతో ధర రూ.278 నుంచి రూ.400పైకి ఎగిసింది. ఈ కంపెనీకి చెందిన మొత్తం 446,00 ఈక్విటీ షేర్లు ఇన్వెస్టర్ల చేతులు మారాయి. ఇంకా బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలలో 160,000 షేర్ల కొనుగోలు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా ఫేస్‌బుక్‌, సారేగామా  ఒప్పందం ద్వారా వినియోగదారులు వీడియోలు, స్టోరీలలో మ్యూజిక్‌ స్టిక్కర్స్‌తో కొత్త వెరైటీ అనుభవాన్ని చూడనున్నారు. అంతేగాకుండా ఫేస్‌బుక్‌ యూజర్లు తమ ప్రోపైల్‌కు సాంగ్స్‌ను జోడించవచ్చని సారేగామ ఇండియా వెల్లడించింది. 
గతంలో గ్రామోఫోన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌గా పిలిచే సారేగామా  ఇండియా దేశంలోనేగాక ప్రపంవ్యాప్తంగా కూడా అతిపెద్ద మ్యూజిక్‌ కంపెనీ. భారతదేశంలో ఇప్పటివరకు రికార్డు చేసిన మొత్తం సంగీతంలో దాదాపు 50 శాతం ఈ కంపెనీ ద్వారానే రూపొందించారు.మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించేందుకు ఈ కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు శుక్రవారం(జూన్‌-5) సమావేశం కానున్నారు. కాగా మధ్యహ్నాం 1:20 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో సారేగామా  ఇండియా లిమెటెడ్‌ షేరు 20 శాతం లాభపడి రూ.400.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Related Tweets
మరిన్ని వార్తలు