రైతులకు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులు

31 Jan, 2018 00:22 IST|Sakshi

 బ్యాంకు చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌

కోల్‌కతా: దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌బీఐ) రైతులకు క్రెడిట్‌ కార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ ‘ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌’ ద్వారా రైతులకు క్రెడిట్‌ కార్డులను అందిస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. మంగళవారమిక్కడ జరిగిన ‘ఫామ్‌కార్ట్‌’, ‘డీలర్‌ బంధు’ యాప్స్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ‘గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో పైలట్‌ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్‌ చేపట్టాం. దీని విజయం ఆధారంగా తర్వాత దేశవ్యాప్త విస్తరణ ఉంటుంది’ అని వివరించారు.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ (కేసీసీ) మాదిరి కాకుండా ఎస్‌బీఐ కార్డులో 40 రోజుల క్రెడిట్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుందని రజనీష్‌ తెలిపారు. ఇతర ఎస్‌బీఐ కార్డులలాగే వీటిల్లోనూ వడ్డీ రేట్లు సాధారణంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే రైతులు నిర్ణీత కాలంలో చెల్లించాల్సిన మొత్తాన్ని కట్టలేకపోతే సంస్థ వసూలు చేసే పెనాల్టీలు ఇతర ఎస్‌బీఐ కార్డుల కన్నా చాలా తక్కువగా ఉంటాయన్నారు.

ఇక రైతులు వారి కార్డులోని క్రెడిట్‌ లిమిట్‌లో 20 శాతాన్ని కన్సూమర్‌ ప్రొడక్టుల కొనుగోలుకు వెచ్చించవచ్చని పేర్కొన్నారు. మిగిలిన బ్యాలెన్స్‌తో అగ్రికల్చర్‌ ఇన్‌పుట్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మరొకవైపు  వ్యవసాయ రంగంలో ఈ– కామర్స్‌ వినియోగం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.  

మరిన్ని వార్తలు