లక్ష్మీ బాం'బుల్'!

19 Oct, 2017 03:50 IST|Sakshi

మార్కెట్లు మరింత ముందుకే: విశ్లేషకులు

పలు బ్రోకరేజీ సంస్థల దీపావళి స్టాక్‌ సిఫారసులు

ఏడాదిలో సెన్సెక్స్‌ 36,000 ఖాయమంటూ అంచనాలు

ఎక్కువగా ఆటో, మెటల్స్‌ రంగాలపై ఆశావహం  

కొన్నాళ్లుగా స్టాక్‌ మార్కెట్లలో అలుపనేది లేకుండా బుల్‌ పరిగెడుతోంది. మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్నాయి. దీపావళి వెలుగులు ముందే కనిపిస్తున్నాయి. గత దీపావళి నుంచి చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 16–18 శాతానికి పైగా పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు, బ్రెగ్జిట్, జీఎస్‌టీ అమలు మొదలైన ప్రతికూల ప్రభావాలు తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో సానుకూల ధోరణులే ఉంటాయన్న అంచనాలతో షేర్లు పరుగులు తీస్తున్నాయి. రాబోయే రోజుల్లోనూ వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లోనే కొనసాగే అవకాశాలు, ఇతరత్రా పెట్టుబడి సాధనాలు అంత ఆశాజనకంగా లేకపోవడం.. వంటి కారణాలూ ఇందుకు తోడవుతున్నాయి. ప్రస్తుతం 32,600 స్థాయిలో ఉన్న సెన్సెక్స్‌... ‘సంవత్‌ 2074’లో 7–10 శాతం వృద్ధితో వచ్చే దీపావళికి 36,000 పైకి చేరొచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇక రిస్కుల విషయానికొస్తే.. చైనా విధానాలపై అనిశ్చితి, యూరప్‌లో సహాయక ప్యాకేజీల ఉపసంహరణ, అమెరికా ద్రవ్య విధాన పాలసీల ప్రభావాలు కనిపించవచ్చనే అంచనాలున్నాయి. నిజానికి దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు ఊహించినంత వేగంగా పుంజుకోవడం లేదు. వృద్ధి టర్న్‌ అరౌండ్‌ కావాల్సి ఉంది. వ్యాపార సంస్థలు మళ్లీ పెట్టుబడులు పెట్టడం మొదలెట్టాల్సి ఉంది. రాబోయే సంవత్‌లో ఆటో, మెటల్స్‌ రంగాలు బాగుండొచ్చని కొన్ని బ్రోకరేజి సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇన్వెస్టర్లు.. దీర్ఘకాలిక బుల్‌ మార్కెట్‌ ముంగిట ఉన్నారంటున్న ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఫార్మాపై బులిష్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధికి అవకాశమున్న షేర్లపై వివిధ బ్రోకరేజి సంస్థలు వెలువరించిన అంచనాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
1. బజాజ్‌ ఆటో
ప్రస్తుత ధర: రూ. 3,225
టార్గెట్‌ ధర: రూ. 3,820
గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి కనబరుస్తోంది. ట్రయంఫ్‌తో జట్టు వల్ల మధ్య స్థాయి బైక్స్‌ పోర్ట్‌ఫోలియో బలపడనుంది.

2. బిర్లా కార్ప్‌
ప్రస్తుత ధర: రూ. 997
టార్గెట్‌ ధర: రూ. 1,220
రిలయన్స్‌ సిమెంట్‌ కొనుగోలు, ప్రతిపాదిత విస్తరణ కార్యకలాపాల నేపథ్యంలో దేశీయంగా అయిదో అతిపెద్ద సిమెంటు కంపెనీగా అవతరించనుంది. ఇన్‌ఫ్రాపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెడుతున్నందున లబ్ధి పొందే అవకాశముంది.

3. ఐసీఐసీఐ ప్రు లైఫ్‌ ఇన్సూరెన్స్‌
ప్రస్తుత ధర: రూ. 391
టార్గెట్‌ ధర: రూ. 520
జీవిత బీమా కార్యకలాపాలు విస్తరించేందుకు భారత్‌లో అపార అవకాశాలున్నాయి. ఇవి కంపెనీ వృద్ధికి తోడ్పడతాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా పటిష్టంగా ఉంది.

4. పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌
టెలికం, లైఫ్‌ సైన్సెస్, బ్యాంకింగ్‌ తదితర రంగాల సంస్థలకు అవసరమైన అనలిటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మొదలైన కొంగొత్త టెక్నాలజీలపై పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ ప్రధానంగా దృష్టిసారిస్తోంది.  ఈ విభాగాల్లో పలు డీల్స్‌ను కూడా సొంతం చేసుకుంటోంది.

5. దివీస్‌ ల్యాబ్‌
ప్రస్తుత ధర: రూ. 877
టార్గెట్‌ ధర: రూ. 1,070
ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఉత్పత్తుల దిగుమతి అలర్ట్‌లను ఎత్తివేసే అవకాశాలుండటం సంస్థకు సానుకూలం. వచ్చే ఆర్థిక సంవత్సరం సంస్థ ఆదాయాలు.. లాభాలు గణనీయంగా మెరుగుపడే అవకాశముంది. కాకినాడ దగ్గర ఒంటిమామిడిలో తయారీ ప్లాంటు కూడా నెలకొల్పుతోంది.

సెంట్రమ్‌ వెల్త్‌

1. ఏజిస్‌ లాజిస్టిక్స్‌
ప్రస్తుత ధర: రూ. 221
ప్రభుత్వం ప్రధానంగా పర్యావరణ అనుకూల ఇంధనాలపై దృష్టి పెడుతుండటం సంస్థకు లాభించనుంది. చమురు, గ్యాస్, కెమికల్స్‌ స్టోరేజి, రవాణా సామర్థ్యాలు పెంచుకునేందుకు గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తోంది. అయితే, సామర్థ్యాల విస్తరణలో జాప్యాలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు మొదలైన

2. లుపిన్‌
ధర: రూ. 1,049
మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద జనరిక్‌ ఔషధాల తయారీ సంస్థ. కొత్త ఔషధాల ఉత్పత్తి కోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై భారీగా వెచ్చించడంతో పాటు ఇటీవలే పలు బ్రాండ్స్‌ను కూడా కొనుగోలు చేసింది. అమెరికా, జపాన్‌ మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నా..  బ్రెజిల్, రష్యా తదితర మార్కెట్లు వృద్ధి చెందనుండటం కంపెనీకి సానుకూలం. అయితే, తయారీ ప్లాంట్లపై నియంత్రణ సంస్థలపరమైన ఆంక్షల అవకాశాలు, దేశీ మార్కెట్‌ మందగమన పరిస్థితులు ప్రతికూలం కాగలవు.

3. మణప్పురం ఫైనాన్స్‌
ధర: రూ. 103.70
బంగారు ఆభరణాల తాకట్టుపై ఫైనాన్స్‌ అందించే అతి పెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. నిరర్ధక ఆస్తులను తగ్గించుకునేందుకు, వ్యాపార పనితీరు మెరుగుపర్చుకునేందుకు కంపెనీ వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పూర్తిగా బంగారం లోన్స్‌పైనే ఆధారపడకుండా.. ఇతరత్రా సూక్ష్మ రుణాలు, గృహ రుణాలు మొదలైన విభాగాల్లోకి కూడా విస్తరిస్తుండటం సానుకూలాంశాలు. బంగారం ధరలు పడిపోయే అవకాశాలు, నియంత్రణ విధానాల్లో మార్పులు, ఇతర సంస్థల నుంచి పోటీ మొదలైనవి ప్రతికూలాంశాలు.

4. పీఐ ఇండస్ట్రీస్‌
ధర: రూ. 788
పంటల సంరక్షణ ఉత్పత్తులు తయారు చేసే అగ్రగామి సంస్థల్లో ఒకటి. వివిధ ఆగ్రోకెమికల్స్‌ మొదలైన వాటి తయారీ కోసం అంతర్జాతీయ సంస్థలతో కూడా ఒప్పందాలు ఉన్నాయి. 1 బిలియన్‌ డాలర్లు పైగా ఆర్డరు బుక్‌ కూడా ఉంది. కొత్తగా 20 పైచిలుకు ఉత్పత్తులపై ఆర్‌అండ్‌డీపై కూడా గణనీయంగా వెచ్చిస్తోంది. ఫార్మా విభాగంలో కస్టమ్‌ సింథసిస్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సర్వీసులపై కూడా దృష్టి పెడుతుండటం సానుకూలాంశాలు. అయితే, పెద్ద ఆర్డర్లు రద్దయ్యే అవకాశాలు, బలహీన రుతుపవనాలు, కొత్త ఉత్పత్తులకు అనుమతుల వంటివి ప్రతికూలంగా ఉండొచ్చు.

5. వి–గార్డ్‌ ఇండస్ట్రీస్‌
ధర: రూ. 191
ఎలక్ట్రానిక్స్‌ రంగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. దక్షిణాదిన వోల్టేజ్‌ స్టెబిలైజర్ల సంస్థల్లో అగ్రగామి కంపెనీ. దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా.. ఇటీవల ఇతర మార్కెట్లపైనా దృష్టి పెడుతోంది. వచ్చే అయిదేళ్లలో దక్షిణాదియేతర మార్కెట్ల నుంచి ఆదాయాలను ప్రస్తుతమున్న 40 శాతం నుంచి 50 శాతానికి పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. గృహోపకరణాలు, స్విచ్‌గేర్స్‌ను కూడా దక్షిణాదియేతర మార్కెట్లలో ప్రవేశపెట్టబోతుండటం వంటివి సానుకూల అంశాలు.

ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్స్‌
1. చంబల్‌ ఫెర్టిలైజర్స్‌
దేశీయంగా యూరియా తయారీలో దిగ్గజ సంస్థ. కొత్త గ్యాస్‌ పూలింగ్‌ పాలసీ కంపెనీకి లాభం కలిగించొచ్చు. కొత్తగా 1.3 మిలియన్‌ టన్నుల మేర ఉత్పత్తి సామర్థ్య విస్తరణ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇవి 2019 ఫిబ్రవరి నాటికి పూర్తి కావచ్చు. డిమాండ్‌– సరఫరా పరమైన వ్యత్యాసం భారీగానే ఉంటున్నందున సమీప భవిష్యత్‌లో అమ్మకాలకేమీ ఢోకా ఉండకపోవడం సానుకూలం .

2. ఇమామి ఇండియా
ప్రస్తుత ధర: రూ. 1,154
టార్గెట్‌ ధర: రూ. 1,200
సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు తయారు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీతో కంపెనీ అమ్మకాలు పెరగొచ్చు. మాస్‌ మార్కెట్‌ ఫోకస్, కొత్త ఉత్పత్తులు, పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటూ ఉండటం సంస్థకు సానుకూలాంశాలు. కేశ్‌కింగ్‌ బ్రాండ్‌తో ఆయుర్వేద ఉత్పత్తుల విభాగాన్నీ పటిష్టం చేసుకుంది. కొత్త ఉత్పత్తులతో మొత్తం ఆదాయం 2–3% మేర పెరగవచ్చు. మొత్తం మీద అమ్మకాల పరిమాణాన్ని రెండంకెల స్థాయిలో వృద్ధి చేసుకోగలదు.

3. గోద్రెజ్‌ కన్జూమర్‌ ప్రాడక్ట్స్‌
ప్రస్తుత ధర: రూ. 963
టార్గెట్‌ ధర: రూ. 985
నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో హెయిర్‌ కలర్లు, ఇళ్లలో క్రిమిసంహారకాలు మొదలైన ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతుండటం సంస్థకు లాభించనుంది. అంతర్జాతీయంగా ఇండోనేసియా, ఆఫ్రికా తదితర దేశాల్లో కార్యకలాపాలు వ్యాపార వృద్ధికి దోహదపడగలవు. ఇక ఆదాయాల్లో  ప్రీమియం ఉత్పత్తుల వాటా గణనీయంగా పెరుగుతుండటం సంస్థకు ప్రయోజనం చేకూర్చేదే. కొంగొత్త ఉత్పత్తులు, పంపిణీ వ్యవస్థ పటిష్టం చేసుకోవడం, పట్టణ ప్రాంతాల్లో డిమాండు పెరుగుతుండటం తదితర అంశాలు సానుకూలమైనవి.

4. ఐసీఐసీఐ బ్యాంకు
ప్రస్తుత ధర: రూ. 263
మొండిపద్దుల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు బ్యాంకుకు సానుకూలాంశాలు. ఇక రిటైల్‌ గృహ రుణాల విభాగం మెరుగైన పనితీరు నమోదు చేస్తోంది. అనుబంధ సంస్థల్లో మరిన్ని వాటాల విక్రయం ద్వారా షేర్‌హోల్డర్లకు మరింత ప్రయోజనాలు చేకూర్చేలా కసరత్తు చేస్తోంది. మొండి బాకీలు అధికంగా ఉన్నా, ప్రొవిజనింగ్‌ వ్యయాలు భారీగా పెరిగినా.. బ్యాంకు మెరుగైన పనితీరే కనపరుస్తోండటం సానుకూలాంశం.

5. ఇండియన్‌ ఆయిల్‌
ప్రస్తుత ధర: రూ.  412
టార్గెట్‌ ధర: రూ. 496
వచ్చే 4–5 త్రైమాసికాల్లో రిఫైనింగ్‌ మార్జిన్లు స్థిరంగా ఉండటంతో పాటు అమ్మకాల పరిమాణం భారీగా ఉండొచ్చన్న అంచనాలు సానుకూలమైనవి. మార్కెటింగ్‌ మార్జిన్లు మెరుగుపడటం, అధిక రేటుపై ఆందోళనలు తగ్గి మళ్లీ చమురు రేట్లకు అనుగుణంగా ధరలను పెంచుకుంటూ వెళ్లేందుకు వీలు చిక్కనుండటం మొదలైనవి కూడా కంపెనీకి అనుకూలంగా పనిచేయొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో పారాదీప్‌ రిఫైనరీ మార్జిన్లు బ్యారెల్‌కి రెట్టింపు స్థాయిలో 10.5 డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాలు కూడా సంస్థకు దోహదపడగలవు. 
– సాక్షి, బిజినెస్‌ విభాగం

మరిన్ని వార్తలు