చిన్న షేర్లు విలవిల

1 May, 2014 01:43 IST|Sakshi
చిన్న షేర్లు విలవిల

భారీ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే అధిక శాతం చిన్న షేర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 22,418 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 19 పాయింట్లు తగ్గి 6,696 వద్ద నిలిచింది. ఇది రెండు వారాల కనిష్టంకాగా, సెన్సెక్స్ తొలుత 214 పాయింట్ల వరకూ లాభపడింది. ఆపై ఉన్నట్టుండి పతనబాటపట్టి 180 పాయింట్ల వరకూ దిగజారింది. ఎన్‌డీఏకు తగిన మెజారిటీ లభించకపోవచ్చన్న అంచనాలు మిడ్ సెషన్‌లో సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మార్కెట్లను మించుతూ బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,704 నష్టపోగా, 973 మాత్రమే బలపడ్డాయి.

 రియల్టీ బోర్లా
 రియల్టీ షేర్లు డీఎల్‌ఎఫ్, యూనిటెక్, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్,  డీబీ, ఇండియాబుల్స్, ఒబెరాయ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 9-3% మధ్య పతనంకావడంతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5.3% పడిపోయింది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, పవర్, వినియోగ వస్తు రంగాలు సైతం 2% చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, భెల్, సెసాస్టెరిలైట్, భారతీ, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, ఐసీఐసీఐ 3.5-1.5% మధ్య తిరోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ 3-1.5% మధ్య లాభపడ్డాయి. బుధవారం ఎఫ్‌ఐఐలు రూ. 454 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

>
మరిన్ని వార్తలు