‘ఆర్‌బీఐ’ నష్టాలు

23 May, 2020 02:24 IST|Sakshi

260 పాయింట్లు పతనమై 30,673కు సెన్సెక్స్‌

67 పాయింట్ల నష్టంతో 9,039కు నిఫ్టీ  

ఆర్‌బీఐ అనూహ్యంగా రెపో రేటును తగ్గించినప్పటికీ, గురువారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. రెపో రేటును తగ్గించడంతో పాటు, రుణ చెల్లింపులపై మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించడం తదితర ఆర్‌బీఐ చర్యలు స్టాక్‌మార్కెట్‌ను మెప్పించలేకపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసల మేర క్షీణించడం, అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరగడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రుణాత్మక వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆర్‌బీఐ అంచనాలు.... ప్రతికూల ప్రభావం చూపించాయి.  దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. ఇంట్రాడేలో 175 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 260  పాయింట్ల నష్టంతో 30,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 67 పాయింట్లు క్షీణించి 9,039 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్‌ 425 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల మేర క్షీణించాయి.  

633 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్‌ నష్టాల్లోనే మొదలైంది. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినా, మళ్లీ అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. అప్పటి నుంచి రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో 175 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 458 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 633 పాయింట్ల రంజ్‌లో కదలాడింది.

► యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 6 శాతం మేర నష్టపోయి రూ.337 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

► రుణ చెల్లింపులపై మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు ఆర్‌బీఐ పొడిగించింది.ఈ నిర్ణయం వల్ల రుణ వసూళ్లలో జాప్యం జరగడమే కాకుండా, రికవరీ మరింత ఆలస్యమవుతుందనే భయాలతో బ్యాంక్, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు 6 శాతం మేర నష్టపోయాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా