అమ్మకానికి స్నాప్‌డీల్‌..?

23 Mar, 2017 00:27 IST|Sakshi
అమ్మకానికి స్నాప్‌డీల్‌..?

ఫ్లిప్‌కార్ట్, పేటీఎంతో చర్చలు
సుమారు రూ.11,700 కోట్లకు ఆఫర్లు
గతేడాదే 6.5 బిలియన్‌ డాలర్లు విలువ
ఏడాది తిరక్కుండానే 80 శాతం విలువ ఆవిరి?
పోటీని తట్టుకోలేకపోవటమే కారణం
అదేమీ నిజం కాదు; అమ్మటం లేదు: స్నాప్‌డీల్‌  


న్యూఢిల్లీ: పుష్కలంగా పెట్టుబడులతో ఒకప్పుడు దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థలకు పోటీనిచ్చిన స్నాప్‌డీల్‌ ప్రస్తుతం నిధుల కొరతతో కుదేలవుతోంది. దీంతో స్నాప్‌డీల్‌ మాతృసంస్థ జాస్పర్‌ ఇన్ఫోటెక్‌ దీన్ని విక్రయించే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా పోటీ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా, పేటీఎం ఈ–కామర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. అయితే ఒకప్పుడు 6 బిలియన్‌ డాలర్లకు పైగా (రూ.40వేల కోట్లు) విలువ  పలికిన స్నాప్‌డీల్‌కు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1.5–1.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 9,750 కోట్లు– రూ. 11,700 కోట్ల దాకా) మేర మాత్రమే ఆఫర్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్‌ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌ ఈ చర్చలకు సారథ్యం వహిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నందున డీల్‌ ముగిసేదాకా సాఫ్ట్‌బ్యాంక్‌ అదనంగా మరో 50 మిలియన్‌ డాలర్లు సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫ్లిప్‌కార్ట్‌ కన్నా కూడా పేటీఎం ఈ–కామర్స్‌తోనే చర్చలు కాస్త పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నాయి. పేటీఎంలో పెట్టుబడులున్న ఆలీబాబా టీమ్‌ డీల్‌కి సంబంధించి ఇటీవలి కాలంలో పలు సార్లు భారత్‌ను సందర్శించింది. ఒకవేళ నిజంగానే స్నాప్‌డీల్‌ గానీ అమ్ముడైన పక్షంలో దేశీ స్టార్టప్‌ వ్యాపారంలో ఇదే అతి పెద్ద డీల్‌ కానుంది. ఈ–కామర్స్‌ రంగంలో దీర్ఘకాలంలో రెండు లేదా మూడు పెద్ద సంస్థలకు మాత్రమే చోటు ఉంటుందని  పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో ఒకటిగా అమెజాన్‌ ఎలాగూ ఉంటుందని పేర్కొంటున్నాయి.

అత్యంత తక్కువగా ఆఫర్లు ..
క్రితంసారి 2016లో నిధులు సమీకరించినప్పుడు స్నాప్‌డీల్‌ వేల్యుయేషన్‌ 6.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇది గరిష్ట వేల్యుయేషన్‌. అయితే ప్రస్తుతం వస్తున్న ఆఫర్లు చూస్తే.. స్నాప్‌డీల్‌ ఇప్పటిదాకా సమీకరించిన నిధుల కన్నా తక్కువ మొత్తమే కనిపిస్తోంది. మరోవైపు, చర్చలు సాగిస్తున్న పేటీఎం, స్నాప్‌డీల్‌కు సంబంధించి ఇన్వెస్టర్లపరమైన సారూప్యత ఉండటం గమనార్హం. పేటీఎంలో ఇన్వెస్టర్‌ అయిన చైనా దిగ్గజం ఆలీబాబాలో... సాఫ్ట్‌బ్యాంక్‌కి పెట్టుబడులున్నాయి. ఇదే సాఫ్ట్‌బ్యాంక్‌ ఇటు స్నాప్‌డీల్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేసింది. స్నాప్‌డీల్‌ ఇప్పటిదాకా దాదాపు 2 బిలియన్‌ డాలర్లు సమీకరించగా.. సాఫ్ట్‌బ్యాంక్‌ సుమారు 900 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా అత్యధిక వాటాలు (సుమారు 35 శాతం) దక్కించుకుంది.

ఈ నేపథ్యంలోనే ఇటు పేటీఎం, అటు స్నాప్‌డీల్‌ మధ్య అనుసంధానకర్తగా సాఫ్ట్‌బ్యాంక్‌ వ్యవహరిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. స్నాప్‌డీల్‌లో కలారి క్యాపిటల్, నెక్సస్‌ క్యాపిటల్, ఆలీబాబా గ్రూప్‌ మొదలైన సంస్థలు కూడా ఇన్వెస్ట్‌ చేశాయి. పేటీఎం ఈ–కామర్స్‌ ఇటీవలే 200 మిలియన్‌ డాలర్లు ఆలీబాబా గ్రూప్‌ నుంచి సమకూర్చుకుంది. అటు ఫ్లిప్‌కార్ట్‌ కూడా మళ్లీ 1 బిలియన్‌ డాలర్లు సమీకరించుకునేందుకు చర్చల్లో ఉంది.

పోటీలో వెనక్కి...: 2015 ఆఖరు నుంచి స్నాప్‌డీల్‌ మార్కెట్‌ వాటాను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ కొల్లగొడుతూ వస్తున్నాయి. దీంతో స్నాప్‌డీల్‌ మూడోస్థానానికి పడిపోయింది. 2016 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 56 శాతం పెరిగి రూ.1,457 కోట్లకు చేరినప్పటికీ .. నష్టాలు కూడా రెట్టింపై రూ. 3,316 కోట్లకు చేరాయి. పెట్టుబడుల రాక తగ్గిపోవడంతో స్నాప్‌డీల్‌ కొన్నాళ్లుగా చేతిలో ఉన్న నగదును జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. గత 3–4 నెలలుగా సిబ్బందిని తగ్గించుకుంటూ వస్తోంది. డిస్కౌంట్లనూ, మార్కెటింగ్‌ వ్యయాలను కూడా గణనీయంగా తగ్గించింది. ఈ పరిణామాలతో మిగతా ఈ–కామర్స్‌ కంపెనీలతో పోటీపడలేక చతికిలబడుతోంది.

అమ్మడం లేదు: స్నాప్‌డీల్‌
వ్యాపార విక్రయ వార్తలను స్నాప్‌డీల్‌ వర్గాలు ఖండించాయి. పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు జరుపుతున్న వార్తలను కూడా తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని, కంపెనీ లాభాల వైపు పురోగమిస్తోందని స్నాప్‌డీల్‌ వర్గాలు వివరించాయి.

బాకీలు తీర్చాలంటూ స్నాప్‌డీల్‌ విక్రేతలకు ఎస్‌బీఐ ఆదేశాలు
నిర్దేశిత స్థాయికి మించి పేరుకుపోయిన రుణాల బాకీలను తీర్చేయాలంటూ స్నాప్‌డీల్‌ ప్లాట్‌ఫాంపై అమ్మకం లావాదేవీలు జరిపే సుమారు 100 మంది విక్రేతలకు ఎస్‌బీఐ సూచించింది. స్నాప్‌డీల్‌ క్యాపిటల్‌ అసిస్ట్‌ ప్రోగ్రాం కింద డ్రాయింగ్‌ పవర్‌కి మించి తీసుకున్న రుణాల బకాయిలను తగ్గించుకోవాలంటూ కొంత మంది సెల్లర్స్‌కు అడ్వైజరీలు పంపినట్లు ఎస్‌బీఐ సీజీఎం (ఎస్‌ఎంఈ) జీకే కన్సల్‌ తెలిపారు. బ్యాంక్‌ సాధారణంగానే స్నాప్‌డీల్‌ సెల్లర్స్‌ అమ్మకాలను ప్రతి క్వార్టర్‌లోనూ సమీక్షిస్తుందని, ఒకవేళ విక్రయాలు తగ్గిన పక్షంలో ఆ మేరకు రుణ బాకీ పరిమాణాన్ని కూడా తగ్గించుకోవాలని సూచిస్తుందని ఆయన వివరించారు. అయితే, ఇది మొండి బకాయిల అంశమేమీ కాదని పేర్కొన్నారు. విక్రేతలకు చెల్లించాల్సిన మొత్తాలను స్నాప్‌డీల్‌ డిఫాల్ట్‌ చేసే అవకాశం ఉందంటూ ఆలిండియా ఆన్‌లైన్‌ వెండార్‌ అసోసియేషన్‌ ఇటీవలే కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు