కొనుగోలు శక్తి తగ్గొచ్చు

20 Nov, 2019 04:32 IST|Sakshi

ఎస్‌బీఐ ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈసారి రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి లభ్యత పెరిగింది. అయితే నాట్లు ఆలస్యం కావడం, పంట విస్తీర్ణం తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించే అవకాశం ఉందని ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ చాయిసెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘వాహన విక్రయాలు గణనీయంగా పడిపోవడాన్ని బట్టి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు. అయితే వాహన రంగంపై ఇటీవల ఎస్‌బీఐ ఓ అధ్యయనం చేసింది. దాంట్లో తేలిందేమంటే ప్రాంతం, వయసు, లింగ భేదం లేకుండా ఆర్థిక స్తోమతను బట్టి కార్లను కొంటున్నారు. అత్యధికులు ఖరీదైన మోడళ్లను కైవసం చేసుకుంటున్నారు. వీటి కోసం రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్య విషయమేమంటే భారత్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నట్టే.. కార్లను కొంటున్న మహిళలూ అధికమవుతున్నారు. అమెజాన్‌ సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్‌ కస్టమర్లు ఖర్చు చేసినదాన్ని బట్టి... ద్వితీయ శ్రేణి నగరాల నుంచీ డిమాండ్‌ ఉంది. దీనినిబట్టి చూస్తే సెంటిమెంట్‌ లేకపోతే ఇంత డిమాండ్‌ ఎలా వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది’ అని వివరించారు. బంగారం ధరలు తగ్గే సూచనలు ఇప్పట్లో కనపడడం లేదని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు