మూడేళ్లలో రూ.50 లక్షల కోట్లు

22 May, 2017 00:30 IST|Sakshi
మూడేళ్లలో రూ.50 లక్షల కోట్లు

ముంబై: ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో దేశీయ స్టాక్‌ మార్కెట్ల సంపద రూ.50 లక్షల కోట్ల మేర పెరుగుదల నమోదు చేసింది. వీటిలో కార్పొరేట్‌ దిగ్గజాలైన టాటా, బిర్లా, అంబానీ, బజాజ్‌ గ్రూపు కంపెనీల మార్కెట్‌ విలువే రూ.లక్ష కోట్ల చొప్పున పెరగడం విశేషం. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ, వేదాంత, గోద్రేజ్, మహింద్రా, హిందుజా, ఐటీసీలు కూడా ఈ కాలంలో మార్కెట్‌ విలువ పరంగా చెపపుకోతగ్గ వృద్ధినే సాధించాయి. కానీ, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల మార్కెట్‌ విలువ పెరుగుదల ఈ స్థాయిలో లేదు. కొన్ని పీఎస్‌యూలు ఇన్వెస్టర్ల సంపదను కరిగించేస్తే, కొన్ని మాత్రం గణనీయమైన లాభాల్నే పంచి పెట్టాయి.

ఈ మూడేళ్ల కాలంలో మొత్తం రూ.50 లక్షల కోట్ల మేర జరిగిన సంపద వృద్ధిలో బీఎస్‌ఈ పీఎస్‌యూ సూచీలోని కంపెనీల వాటా 8 శాతమే. అంటే ఇవి వాటి మార్కెట్‌ విలువను కేవలం 22 శాతం వృద్ధితో రూ.3.65 లక్షల కోట్ల మేరే పెంచుకోగలిగాయి. మోదీ సర్కారు మూడేళ్ల పాలనలో సెన్సెక్స్‌ పెరుగుదల 26 శాతంగా (6,000 పాయింట్లు) ఉంది. మొత్తం మీద దేశీయ స్టాక్‌మార్కెట్ల విలువ రూ.75 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ.125 లక్షల కోట్ల స్థాయికి వృద్ధి చెందింది. ఈ మొత్తం విలువలో పీఎస్‌యూ కంపెనీల వాటా 16 శాతం. ఈ సంపద వృద్ధిలో అధిక భాగం ప్రమోటర్లకే చెందగా, ఆ తర్వాత ఎక్కువగా లాభపడిన వారిలో విదేశీ ఇన్వెస్టర్లు ఉన్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా కంపెనీల్లో సగటున 10 శాతంలోపే ఉండడంతో వారికి దక్కింది కూడా తక్కువగానే ఉంది.

మరిన్ని వార్తలు