స్టాక్స్ వ్యూ

28 Sep, 2015 00:10 IST|Sakshi

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్  ప్రస్తుత ధర: రూ.722
టార్గెట్ ధర: రూ.840  ఎందుకంటే: ప్రైవేట్ రంగంలో రెండో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. కంపెనీ ఆస్తులు రూ.57,231 కోట్లుగా ఉన్నాయి.  220 బ్రాంచీలతో 2,000 మంది శిక్షణ పొందిన ఉద్యోగులతో హౌసింగ్ ఫైనాన్స్ సేవలందిస్తోంది. వేతనాలు పొందే ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందేవారికి, వ్యాపారస్తులకు త్వరితగతిన, సౌకర్యవంతమైన తగిన రీతి వడ్డీరేట్లతో గృహరుణాలనందిస్తోంది.

ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,901 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.511 కోట్లకు, ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.1,828 కోట్లకు పెరిగాయి.  ఈ ఏడాది జూన్ 30 నాటికి  నగదు, నగదు సమాన నిల్వలు, ఇన్వెస్ట్‌మెంట్స్ కలిపి రూ.9,552 కోట్లుగా ఉన్నాయి. బెస్ట్ అఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అసోచామ్ హౌసింగ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఈ ఏడాది ఈ కంపెనీకే లభించింది.  

కంపెనీ షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.68గానూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నికర అమ్మకాలు 17 శాతం, నికర లాభం 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మార్కెట్ ధరకు, పుస్తక ధరకు మధ్య నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 2.9గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.3గానూ ఉండొచ్చని భావిస్తున్నాం.

మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.840 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. ఆర్థిక సెంటిమెంట్ పుంజుకుంటుండటం, రుణగ్రస్తుల ఆదాయ స్థాయిలు పెరుగుతుండడం, ప్రాపర్టీల ధరలు తగ్గుతుండడం, వడ్డీరేట్లు దిగివస్తుండడం, చౌక ధరల్లో గృహాలందించడానికి జోరుగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుండడం... ఇవన్నీ కంపెనీకి కలిసివచ్చే అంశాలు.
 
జస్ట్ డయల్: కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్  ప్రస్తుత ధర: రూ.990
టార్గెట్ ధర: రూ.1,200  ఎందుకంటే: భారత్‌లో అతిపెద్ద లోకల్ సెర్చ్ ఇంజిన్ కంపెనీ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థల, ఉత్పత్తుల, సేవల సమాచారాన్ని, సమీక్షలను వినియోగదారులకు అందిస్తోంది. ఇంటర్నెట్, మొబైల్ ఇంటర్నెట్, టెలిఫోన్(వాయిస్), ఎస్‌ఎంఎస్... ఇలా విభిన్నమైన ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వినియోగదారులకు ఆ వివరాలనందిస్తోంది. లోకల్ సెర్చ్ బిజినెస్‌లో అగ్రస్థానం ఈ కంపెనీదే.

2,000 నగరాల్లో కోటిన్నరకు పైగా లిస్టింగ్స్(వ్యాపార సంస్థల, ఉత్పత్తుల వివరాలు) ఉన్నాయి.  9,500 మంది ఉద్యోగుల సేవలతో ఈ డేటాబేస్‌ను జస్ట్ డయల్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ఈ కంపెనీ అందిస్తున్న సెర్చ్ ప్లస్ ఫీచర్ ద్వారా లోకల్ సెర్చింగ్ కంపెనీ నుంచి లావాదేవీలు నిర్వహించే కంపెనీగా రూపాంతరం చెందనున్నది. పూర్తి ప్రయోజనాలు రానున్న 2-3 ఏళ్లలో కనిపిస్తాయని అంచనా.

ఈ ఏడాది అక్టోబర్‌లో సెర్చ్ ప్లస్‌కు సంబంధించిన ప్రచారాన్ని మరింత విస్తృతంగా తీసుకురానున్నది. సినిమా టికెట్ల బుకింగ్, క్యాబ్, బస్, విమానటికెట్ల బుకింగ్, రెస్టారెంట్లకు సంబంధించి ఆర్డరింగ్, టేబుల్ బుకింగ్స్, ఆన్‌లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి సేవలను సెర్చ్ ప్లస్ ఆఫర్ చేస్తోంది. జేడీ సెర్చ్‌ప్లస్ ప్లాట్‌ఫారమ్ కింద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరి,వైన్ డెలివరి, డాక్టర్ అపాయింట్‌మెంట్, ట్యాక్స్ బుకింగ్స్ వంటి 57 రకాల ప్రొడక్ట్‌లను ఆఫర్ చేస్తోంది. లిస్టింగ్స్, లావాదేవీలను కలగలిపిన సేవలను సెర్చ్‌ప్లస్ అందించనున్నది.  

ఆర్‌బీఐ నుంచి కొన్ని అనుమతులు రావలసి ఉన్నం దున జేడీ వాలెట్‌ను వాయిదా వేసిన కంపెనీ  యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్ వాలెట్‌ను అందించాలని యోచిస్తోంది. జస్ట్ డయల్ గ్యారంటీడ్, జస్ట్ డయల్ క్యాష్, ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ వంటి కొత్త సర్వీసులను అందుబాటులోకి తేనున్నది.
 
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
 
 
APPకీ కహానీ... డైలీ ఎక్స్‌పెన్సెస్
ఖర్చులుపెరిగిపోతున్నాయనో, వాటిపై నియంత్రణ తప్పిపోతోందనో, మీకు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తున్నారనో ఇక ఎలాంటి దిగులూ అవసరం లేదు. ఎందుకంటే మీ మొబైల్‌లోనే మీ ఆర్థిక లావాదేవీల నిర్వహణ ఎంచక్కా ఈజీగా చేసేసుకోవటానికి చక్కని యాప్ రెడీగా ఉంది. అదే  ‘డైలీ ఎక్స్‌పెన్సెస్’. ఇది మీ ఆదాయానికి తగినట్లుగా ఖర్చులెలా చేయాలో చెబుతుంది. తగిన సూచనలిస్తుంది. ఖర్చులను నియంత్రించి, డబ్బును పొదుపు చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై లభిస్తున్న ఈ యాప్‌ను యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
ఇవీ ప్రత్యేకతలు
* ఆదాయ, వ్యయాలను పరిశీలించి బడ్జెట్‌ను రూపొందిస్తుంది.
* మీ ఆదాయాలకు, ఖర్చులకు సంబంధించిన లావాదేవీలను కేటగైరె జ్ చేస్తుంది.
* ఆదాయ, వ్యయాలకు సంబంధించి క్రియేట్ చేసిన రికార్డులను తొలగించవచ్చు కూడా.
* భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బిల్స్ రిమైండ ర్లను, బిల్స్ అలర్ట్స్‌ను సెట్ చేసుకోవచ్చు.
* ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఇంటర్‌నెట్ లేనపుడు ఆఫ్‌లైన్‌లో కూడా చూసుకోవచ్చు.
* పాస్‌వర్డ్ పెట్టుకునే వీలున్న ఈ యాప్‌లో యూజర్ల సమాచారానికి కంపెనీ భరోసా ఇస్తోంది.
* ఆదాయం ఎన్ని మార్గాల్లో వస్తుందో, అది ఏ విధంగా ఖర్చు అవుతుందో, ఏ ప్రాంతంలో వెచ్చిస్తున్నామో వంటి అంశాలను రోజూ వారీగా, వారం వారీగా, నెల వారీగా, నెలల వారీగా, ఏడాది వారీగా చూసుకోవచ్చు.
 
బ్రీఫ్స్
అవైవా ధన్‌వృద్ధి ప్లస్

ప్రైవేటు రంగ బీమా కంపెనీ అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ ధన్‌వృద్ధి ప్లస్ పేరుతో పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించే ఎండోమెంట్ పాలసీని మార్కెట్లోకి విడుదల చేసింది. 20 ఏళ్ల కాలపరిమితి గల ఈ పాలసీకి ప్రీమియం 5 లేదా  7 లేదా 11 ఏళ్లు చెల్లిస్తే సరిపోతుంది. పాలసీ కాలపరిమితి తర్వాత 100 శాతం ప్రీమియంతో పాటు బోనస్‌లు చెల్లించడం జరుగుతుంది. ఈ పాలసీని 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు తీసుకోవచ్చు.
 
కోటక్ ఇండియా గ్రోత్ ఫండ్
కోటక్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఇండియా గ్రోత్’ సిరీస్-2 ఈక్విటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ ఆర్థిక వృద్ధిరేటుకు దోహదం చేసే రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇది క్లోజ్‌డ్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 1,095 రోజుల వరకు వైదొలగడానికి ఉండదు. సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఎన్‌ఎఫ్‌వో అక్టోబర్ 6తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 5,000గా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు