స్టాక్స్ వ్యూ

7 Mar, 2016 00:34 IST|Sakshi
స్టాక్స్ వ్యూ

ఇండిగో  కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠి    ప్రస్తుత ధర: రూ.872
 టార్గెట్ ధర: రూ.1,200
 ఎందుకంటే: దేశీయ విమాన రంగంలో మూడో వంతు మార్కెట్ వాటా ఈ కంపెనీదే. ఎనిమిదేళ్లుగా వరుసగా లాభాలనార్జిస్తోంది. మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితులు,  విమానాల కొనుగోలు వ్యూహాం, విమానయాన రంగంపై ప్రభుత్వం ఎన్నడూ లేనంతగా దృష్టిసారించడం, ముడి చమురు ధరల అనుకూలంగా ఉండడం ఇవన్నీ కంపెనీకి సానుకూలమైన అంశాలు. కంపెనీ విమానాల కొనుగోళ్ల వ్యూహం వినూత్నంగా ఉంది.  ఎక్కువ మొత్తంలో విమానాలను కొనుగోలు చేయడం కారణంగా  భారీ డిస్కౌంట్లు డిమాండ్ చేయడం, కొనుగోలు చేసి, మళ్లీ లీజ్‌కు తీసుకునే ఆప్షన్ కోసం సంప్రదింపులు జరపడం, తదితర అంశాల కారణంగా విమానాల కొనుగోలు(యాజమాన్య) వ్యయం తగ్గనున్నది. మరోవైపు ఒకే రకమైన విమానాలను కొనుగోలు వల్ల సిబ్బంది శిక్షణ, విమానాల నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి.  ఇంధన వ్యయాలు కూడా తగ్గుతాయి. విమాన యాన ఇంధనం ధరలు తక్కువ స్థాయిలోనే ఉండడం, ప్రజల వ్యయార్హ ఆదాయాలు పెరుగుతుండడం, రైల్వేలతో పోల్చితే విమానయాన ధరలు తగిన స్థాయిలోనే  ఉండడం, కేంద్ర ప్రభుత్వం విమానయాన రంగాభివృద్ధికి పలు చర్యలు తీసుకోనుండడం వంటి అంశాల కారణంగా భారత విమానయాన రంగం టర్న్ అరౌండ్ కానున్నది.  కొత్త విమానాల డెలివరీ ఆలశ్యం కావడంతో ఇటీవల ఈ షేర్ కొంత కరెక్షన్‌కు గురయింది. రెండేళ్లలో కంపెనీ ఆదాయం 23 శాతం, ఇబిటా 36 శాతం, నికర లాభం 38 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఒక ఏడాదిలో రూ.1,200కు చేరుతుందని అంచనా వేస్తున్నాం. విమానాల డెలివరీ మరింత జాప్యం అయినా,  ముడి చమురు ధరలు పెరిగినా.. ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ఆల్ట్రాటెక్ సిమెంట్ కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్   ప్రస్తుత ధర: రూ.2,932
టార్గెట్ ధర: రూ.3,372
ఎందుకంటే: జైప్రకాశ్ అసోసియేట్స్(జేపీఏ)కు చెందిన 12  సిమెంట్ ప్లాంట్‌లను కొనుగోలు చేయడానికి ఇటీవలనే ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ డీల్ విలువ రూ.16,500 కోట్లు. ఈ ప్లాంట్ల కొనుగోలుతో 94.5 మిలియన్ టన్నుల కెపాసిటీతో ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో సిమెంట్ కంపెనీగా(చైనా మినహా) అవతరించనున్నది. డిమాండ్ వేగంగా పెరుగుతుండడం, కొత్తగా ప్లాంట్ ఏర్పాటు చేయడం అత్యంత వ్యయ భరితం కావడం, సుదీర్ఘ కాలం పడుతుండడం, జేపీ ప్లాంట్లు వివిధ మార్కెట్లకు సమీపంలో ఉండడం వంటి కారణాల వల్ల జేపీ సిమెంట్ ప్లాంట్లను ఆల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది.  ఈ 12 ప్లాంట్‌లకు కనీసంలో కనీసం 40 ఏళ్ల సున్నపురాయి నిల్వలున్నాయి. కొన్ని ప్లాంట్లకైతే ఈ నిల్వలు 150 ఏళ్ల వరకూ సరిపోతాయని అంచనా. కొన్ని అవాంతరాలున్నప్పటికీ ఈ డీల్‌కు చట్టపరమైన ఆమోదం లభించగలదని కంపెనీ ఆశిస్తోంది. అన్ని అవాంతరాలను దాటుకుని ఈ డీల్ ఏడాది కాలంలో పూర్తవగలదని కంపెనీ భావిస్తోంది. జేపీ డీల్ కారణంగా రుణ భారం పెరిగి, ఈపీఎస్ తగ్గుతుంది. అయితే అపారంగా సున్నపు రాయి నిల్వలు అందుబాటులోకి రావడం, వివిధ మార్కెట్లకు చేరువ కావడం, దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపుతాయి. దేశవ్యాప్తంగా 17-18 శాతం మార్కెట్ వాటా ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి ఉంది. పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా 18-20 శాతం మార్జిన్లు సాధించింది. వైట్ సిమెంట్ విభాగం మంచి లాభాలను ఆర్జించింది. ఇటీవల విస్తరణ కారణంగా ప్లాంట్ల వినియోగం తగిన స్థాయిలో ఉండడం, ఇటీవల కష్టకాలంలోనూ నిలకడైన అమ్మకాలు సాధించడం కంపెనీకి కలసి వచ్చే అంశాలు.
 
 
 ఐఎఫ్‌బీ ఆగ్రో కొనొచ్చు
 బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్   ప్రస్తుత ధర: రూ.399
 టార్గెట్ ధర: రూ.435
 ఎందుకంటే:
ఈ కంపెనీ ఎరువులను, జంతువుల ఆహార పదార్ధాలను విక్రయిస్తోంది. రసాయనాలకు సంబంధించి ప్రాజెక్ట్ ఇంజినీరింగ్, కాంట్రాక్ట్ సర్వీసులను కూడా అందిస్తోంది. ఆల్కహాలిక్ పానీయాలను, ఫ్లేవర్డ్ మద్యాన్ని, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, టెక్నికల్ ఆల్కహాల్ వంటి రకరకాల ఆల్కహాల్ వెరైటీలను తయారు చేస్తోంది. వివిధ  రకాల బ్రాండ్లతో మద్యాన్ని ఉత్పత్తి చేస్తోంది.  డిస్టిల్లరీ, ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్(ఐఎంఎఫ్‌ఎల్), మెరైన్... ఇలా మూడు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మెరైన్ వ్యాపారంలో భాగంగా అమెరికా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు రొయ్యలను ఎగుమతి చేస్తోంది.  ఇక దేశీయంగా రెడీ టు కుక్, రెడీ టు ఫ్రై సీ ఫుడ్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఐఎంఎఫ్‌ఎల్ డివిజన్ కింద రెండు ప్లాంట్లు ఉన్నాయి. సొంత బ్రాండ్లతో పాటు డియాజియోకు చెందిన స్మిర్న్‌ఆఫ్, యునెటైడ్ స్పిరిట్స్ బ్రాండ్లను కూడా తయారు చేస్తోంది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ3లో రూ.140 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు 7 శాతం వృద్ధితో రూ.150 కోట్లకు పెరిగాయి. నికర లాభం రూ.1.24  కోట్ల నుంచి 556 శాతం వృద్ధితో రూ.8.14 కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం రూ.8 కోట్ల నుంచి 96 శాతం వృద్ధితో రూ.16 కోట్లకు పెరిగింది. ఇటీవలనే రోజుకు 50 వేల లీటర్ల గ్రెయిన్ డిస్టిల్లరీ ఆధునికీకరణను ప్రారంభించింది. రెండేళ్లలో నికర అమ్మకాలు 10 శాతం, నికర లాభం 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య, దీర్ఘకాలాలకు రూ.435 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాం.
 

మరిన్ని వార్తలు