ఏప్రిల్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలపై రాయితీలు 

11 Mar, 2019 01:03 IST|Sakshi

ఫేమ్‌–2 పథకం అమల్లోకి

మూడేళ్లలో రూ.10,000 కోట్ల  ప్రోత్సాహకాలు 

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని వేగంగా అమల్లోకి తీసుకొచ్చేందుకు, తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్‌–2 పథకం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద 2019 ఏప్రిల్‌ 1 నుంచి 3 ఆర్థిక సంవత్సరాల కాలంలో కేంద్రం రూ.10,000 కోట్ల మేర విద్యుత్‌తో నడిచే వాహనాల కొనుగోలుదారులకు రాయితీలు కల్పించనుంది. ఈ పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు, ఒక్కో వాహనానికి రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. 35వేల కార్లకు ఒక్కోదానికి రూ.1.5 లక్షల సబ్సిడీ పొందొచ్చు. హైబ్రిడ్‌ కార్లకు ఒక్కో వాహనానికి రూ.13,000–20,000 వరకు రాయితీని ప్రతిపాదించారు.

అలాగే, 5 లక్షల ఈ రిక్షాలకు, ఒక్కో వాహనంపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే, 7,090 ఈ బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సిడీ లభించనుంది. 2019–20 సంవత్సరం లో రూ.1,500 కోట్లు, 2020–21లో  5,000 కోట్లు, 2021–22లో 3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు ధర లో గరిష్టంగా 40%, ఇతర వాహనాలకు 20%గా ప్రోత్సాహకాన్ని పరిమితం చేశారు. ఇది సరైన సమయంలో సరైన అవకాశమని, ఫేమ్‌–1కు, ఫేమ్‌–2కు మధ్య విరామం లేకుండా కొనసాగింపు అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణుమాథుర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు