టెల్కోలపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

18 Mar, 2020 17:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  టెలికం సంస్థలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఏజీఆర్‌ బకాయిల ఛార్జీల చెల్లింపుల విషయంలో ఎలాంటి  ఎలాంటి పునఃసమీక్ష ఉండదని   తేల్చి చెప్పింది.  ఇందుకు అనుమతినిచ్చిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ను లెక్కించేందుకు మరోసారి ప్రయత్నించవద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై  కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. అసలు వీటిని ఎవరు సమీక్షించమన్నారంటూ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 24 న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు నిర్ణయించిన  ఏజీఆర్‌ బకాయిలను స్వీయ అంచనా వేయడం లేదా తిరిగి అంచనా వేయడం ఉండదని స్పష్టం చేసింది.  

బకాయిలు వసూలుపై ప్రభుత్వ తీరుపై కూడా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీం పునర్‌స మీక్షకు గడువు ఇవ్వాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కోర్టును ప్రభావితం చేయడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది.  ఒకవేళ మళ్లీ తిరిగి సమీక్షిస్తే కోర్టు గతంలో తప్పుచేసినట్లు అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపుల పునర్‌సమీక్షకు అనుమతించిన అధికారుల్ని సహించేది లేదని హెచ్చరించింది. టెలికం కంపెనీలు తప్పనిసరిగా ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సిదేనని గత ఆక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన సంగతి  తెలిసిందే. అయితే బకాయిల్ని మళ్లీ సమీక్షించాలంటూ అనేకసార్లు కోర్టును ఆశ్రయించాయి టెలికాం  కంపెనీఉ. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెలలోనూ సుప్రీంకోర్టు సంస్థలపైనా, ప్రభుత్వంపై విరుచుకుపడింది. దీంతో కొన్ని సంస్థలు బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించాయి. కానీ మరోసారి కోర్టు సమీక్షిస్తే కొంత మినహాయింపు లభించే అవకాశం ఉందని భావించిన సంస్థలు వేచిచూశాయి. కానీ తాజా మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బకాయిలే పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులు 20 ఏళ్ల పాటు వాయిదాల రూపంలో చెల్లించేందుకు సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను రూపొందించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఏజీఆర్‌​ చార్జీల చెల్లింపు వల్ల సంస్థ పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పేర్కొంది. లక్షలాది మంది వినియోగదారుల పైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతూ  తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
 

మరిన్ని వార్తలు