టాటా స్టీల్ నష్టం రూ.3,183 కోట్లు

13 Sep, 2016 00:47 IST|Sakshi
టాటా స్టీల్ నష్టం రూ.3,183 కోట్లు

ఆదాయం 6 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ నష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(యూరప్ ఇతరత్రా కార్యకలాపాలు కలిపి) రూ.3,183 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.316 కోట్లతో పోలిస్తే దాదాపు 10 రెట్లు పెరిగింది. కాగా, క్యూ1లో కంపెనీ మొత్తం ఆదాయం 6 శాతం దిగజారి రూ.26,406 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.28,025 కోట్లు. ప్రధానంగా లాంగ్‌స్టీల్ యూకే లిమిటెడ్‌ను రూ.3,296 కోట్ల నష్టానికి గ్రేబుల్ క్యాపిటల్ ఎల్‌ఎల్‌పీకి విక్రయించడం, దీన్ని తొలి త్రైమాసికంలో నమోదుచేయడం కారణంగా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది.

దీన్ని మినహాయించి ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపారాన్ని పరిగణనలోకి తీసుకుంటే టాటా స్టీల్ గ్రూప్ ఈ ఏడాది క్యూ1లో రూ.172 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని, చాలా త్రైమాసికాల తర్వాత తొలిసారి మెరుగైన పనితీరును సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా, భారత్, ఆగ్నేయాసియా యూరప్ కార్యకలాపాల పనితీరు మెరుగుపడటంతో నిర్వహణ లాభం క్యూ1లో 21 శాతం పెరిగింది. మరోపక్క, కంపెనీ మొత్తం వ్యయాలు రూ.26,680 కోట్ల నుంచి రూ.24,406 కోట్లకు దిగిరావడం గమనార్హం.

ఎగబాకిన రుణ భారం: టాటా స్టీల్ స్థూల రుణ భారం క్యూ1లో రూ.85,475 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇది రూ.81,975 కోట్లు. ఇక నికర రుణ భారం రూ.4,171 కోట్లు పెరిగి రూ.75,259 కోట్లకు చేరింది. భారత్‌లో కొత్తగా చేపట్టిన రుణ సమీకరణ(బాండ్‌ల జారీ రూపంలో), అంతర్జాతీయంగా కొనుగోళ్లు(ప్రొక్యూర్‌మెంట్) వంటివి రుణ భారం పెరిగేందుకు దారితీసింది. కాగా, ప్రస్తుతం తమ వద్ద రూ.12,746 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు టాటా స్టీల్ వెల్లడించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో 5.41 మిలియన్ టన్నుల స్టీల్ అమ్మకాలను నమోదు చేసినట్లు తెలిపింది.

జూన్ క్వార్టర్‌లో కంపెనీ మొత్తం రూ.2,442 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు రూ.1,118 కోట్లను వెచ్చించింది. యూరప్ యూనిట్ల అమ్మకంపై దృష్టి: స్పెషాలిటీ స్టీల్ వ్యాపారంతోపాటు హార్టెల్‌పూల్‌లో ఉన్న పైప్ మిల్స్‌ను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని టాటా స్టీల్ వివరించింది. ఇక టాటా స్టీల్ యూరప్ విభాగం కూడా జాయింట్ వెంచర్ లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇది ఒక కొలిక్కివస్తుందని పేర్కొంది.

యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలగిన నేపథ్యంలో బ్రిటన్ వృద్ధి రేటుపై కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చని.. ఈ నేపథ్యంలో ఇక్కడి తమ కార్యకలాపాలు గాడిలోపడేందుకు వ్యవధి పడుతుందని టాటా స్టీల్ అంచనా వేసింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో 5.3 శాతం దిగజారి రూ.373.60 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.36,285 కోట్లకు తగ్గింది.

>
మరిన్ని వార్తలు