జూన్‌ క్వార్టర్‌పై గంపెడాశలు

7 Jul, 2018 01:02 IST|Sakshi

ఆదాయం, లాభాల్లో రెండంకెల వృద్ధి!

గతేడాది జూన్‌లో కనిష్ట స్థాయిలో పనితీరు

అక్కడి నుంచి చూస్తే మెరుగైన ఫలితాలకు ఛాన్స్‌

10న టీసీఎస్‌తో ఫలితాల సీజన్‌ ఆరంభం

అదే రోజు ఇండస్‌ఇండ్‌ కూడా

ఆటోమొబైల్స్, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్‌ గూడ్స్‌పై అధిక అంచనాలు

ఫార్మాకు కలసిరానున్నరూపాయి క్షీణత

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో జూన్‌ త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఆరంభం కానుంది. దేశ కార్పొరేట్‌ రంగం ఈ సారి రెండంకెల స్థాయిలో ఫలితాల వృద్ధిని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్‌ త్రైమాసికంలో వృద్ధి తక్కువ స్థాయిలో నమోదు కావడమే మెరుగైన అంచనాలకు బలం.

టీసీఎస్‌ ఫలితాలు ఈ నెల 10న వెల్లడవుతాయి. అదే రోజు ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంకు సైతం ఫలితాలు ప్రకటించనుంది. ఆటోమొబైల్స్, క్యాపిటల్‌ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా తదితర రంగాల కంపెనీల నుంచి ఆశాజనక ఫలితాలు రావచ్చనే అంచనాలున్నాయి. ఆదాయం, లాభాల్లోనూ రెండంకెల పెరుగుదల ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సగటు వృద్ధి ఆదాయంలో 12.1 శాతం, లాభాల్లో 13.5 శాతం ఉంటుందని అంచనా.  

ఆటోమొబైల్స్‌
అన్ని రకాల వాహన విభాగాల్లో స్థిరమైన అమ్మకాల వృద్ధితో ఆటోమొబైల్‌ కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటించనున్నాయని అంచనా. కస్టమర్లలో వాహనాలను మార్చే ధోరణి, ధరల పెరుగుదల కూడా వీటికి కలసిరానుంది. ఏప్రిల్‌–జూన్‌ కాలంలో వాహనాల అమ్మకాలు 13–60 శాతం స్థాయిలో పెరిగాయి. బజాజ్‌ ఆటో, మారుతి సుజుకి, టాటా మోటార్స్‌ దేశీయ కార్యకలాపాలపై మంచి ఆదాయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.  

బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌
ప్రైవేటు రంగ బ్యాంకులు, ముఖ్యంగా కార్పొరేట్‌ రుణాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కొత్త ఎన్‌పీఏలను తక్కువగా ప్రకటించొచ్చని భావిస్తున్నారు. గత త్రైమాసికాల్లో అధిక ఎన్‌పీఏలను చూపించడమే కారణం. దీనికితోడు రిటైల్‌ రుణాల్లో వృద్ధితో ఇవి మంచి ఫలితాలను ప్రకటించొచ్చని అంచనా.  

క్యాపిటల్‌ గూడ్స్‌
ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టుల రూపేణా మద్దతుతో క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీలు మంచి ఫలితాలను నమోదు చేయనున్నాయి. ఎల్‌అండ్‌టీ తన ఆర్డర్లలో వృద్ధి 12–15 శాతం ఉంటుందని గతంలో అంచనాలను ప్రకటించింది. కనుక ఈ స్థాయిలో ఆర్డర్ల రాక ఉందా అన్నది గమనించాలి. పవర్‌గ్రిడ్‌ గత క్వార్టర్ల స్థాయిలోనే వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా.

సిమెంట్‌
జూన్‌ త్రైమాసికంలో సిమెంట్‌ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కనుక కంపెనీలు మరీ ఆశాజనక ఫలితాలను నమోదు చేయకపోవచ్చని భావిస్తున్నారు. పెద్ద కంపెనీల అమ్మకాల వృద్ధి మాత్రం 5 నుంచి 18 శాతం మధ్యలో ఉండనుంది. కంపెనీలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 4 నుంచి 21 శాతం మధ్యలో ఆదాయాల్లో పెరుగుదల చూపే అవకాశం ఉంది.  

ఐటీ...
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వంటి దిగ్గజ కంపెనీలు డాలర్‌ మారకంలో 2–3 శాతం మేర ఆదాయ వృద్ధికే పరిమితం కానున్నాయి. యూరో, పౌండ్, డాలర్‌ మధ్య మారకం రేట్లలో అననుకూల పరిస్థితులతో డాలర్‌తో పోలుస్తూ రూపాయి సగటు ధర సీక్వెన్షియల్‌గా 4 శాతం తక్కువగా ఉంటుందని అంచనా.

మెటల్స్‌...
నాన్‌ ఫెర్రస్‌ కంపెనీలతో పోలిస్తే ఫెర్రస్‌ మెటల్‌ కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నాన్‌ ఫెర్రస్‌ కంపెనీలు వ్యయాల పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కోల్‌ ఇండియా ఆదాయంలో మాత్రం 15 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

టెలికం...
డేటా వినియోగం పెరిగినప్పటికీ సగటున ఓ వినియోగదారుడి ద్వారా వచ్చే నెలవారీ ఆదాయం కనిష్టానికి పడిపోవడం, తదితర ఒత్తిళ్లతో పెద్దగా వృద్ధికి అవకాశాల్లేవన్నదే అంచనా.


ఫార్మా
ఫార్మా కంపెనీలు దేశీయ వ్యాపారంపై రెండంకెల వృద్ధిని నమోదు చేయనున్నాయి. కారణం గతేడాది జూన్‌ క్వార్టర్లో వృద్ధి తక్కువ స్థాయిలో ఉండడంతో ఆ క్వార్టర్‌తో పోలిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అమెరికా వ్యాపారం ఫ్లాట్‌ నుంచి కాస్తంత సానుకూలంగానే ఉండొచ్చని అంచనా. అయితే, రూపాయి విలువ క్షీణతతో రెండంకెల స్థాయిలో వృద్ధిని నమోదు చేయనున్నాయి.

ఎఫ్‌ఎంసీజీ  
ఎఫ్‌ఎంసీజీ కంపెనీల జూన్‌ త్రైమాసికం ఫలితాలను గతేడాది ఇదే కాలంలో పోల్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గతేడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి రానుండడంతో జూన్‌ క్వార్టర్లో సరుకుల నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండు త్రైమాసికాల్లో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో ఆశాజనక వృద్ధి నమోదు కాగా, జూన్‌ త్రైమాసికంలోనూ ఇదే కొనసాగుతుందని భావిస్తున్నారు. ప్రధాన సూచీలో భాగమైన హెచ్‌యూఎల్, ఐటీసీ మాత్రం పరిమిత స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా.

మరిన్ని వార్తలు