టెక్ మహీంద్రాకు రూపీ దెబ్బ

27 May, 2015 00:41 IST|Sakshi
టెక్ మహీంద్రాకు రూపీ దెబ్బ

* 23 శాతం క్షీణించిన నికర లాభం
* ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు 23% తగ్గింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, వేతనాల పెంపు, ఇటీవల కొనుగోలు చేసిన కంపెనీల పనితీరు పేలవంగా ఉండడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మిలింద్ కుల్‌కర్ణి చెప్పారు. 2013-14 క్యూ4లో రూ.614 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 క్యూ4లో రూ.472 కోట్లకు తగ్గిందని,  ఆదాయం మాత్రం రూ.5,058 కోట్ల నుంచి 21% వృద్ధితో రూ.6,117 కోట్లకు పెరిగిం దని పేర్కొన్నారు.

ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల పరంగా అత్యధిక వృద్ధి సాధించిన క్వార్టర్లలో ఇదొకటని వివరించారు. డాలర్ల పరంగా ఆదాయం 19% వృద్ధితో 98 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.2,628 కోట్లకు తగ్గిందని, ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.22,628 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. డాలర్ల పరంగా నికర లాభం 43 కోట్ల డాలర్లుగా, ఆదాయం 19 శాతం వృద్ధితో 368 కోట్ల డాలర్లకు చేరిందని వివరించారు.  కొత్తగా చేరిన 13,840 మంది ఉద్యోగులతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,03,281కు పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రూ.700 కోట్ల రుణభారం,  రూ.3,212 కోట్ల నగదు నిల్వలున్నాయి.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ధర మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం క్షీణించి రూ.640 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు