రూ.5,000 కోట్లతో రష్యా చమురు కొనుగోలు

15 Sep, 2023 01:03 IST|Sakshi

చమురు సంస్థల యోచన

న్యూఢిల్లీ: రష్యా వద్ద నిలిచిపోయిన 600 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5వేల కోట్లు) డివిడెండ్‌తో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఉన్నాయి. రష్యా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ క్షేత్రాల్లో తమ పెట్టుబడులకు సంబంధించిన డివిడెండ్‌ ఆదాయం ఇండియన్‌ ఆయిల్, ఆయిల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ విదేశ్‌ రావాల్సి ఉంది. రష్యా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం ఉండిపోయింది.

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పశి్చమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత చమురు సంస్థలు రష్యా బ్యాంకుల నుంచి డివిడెండ్‌ నిధులను తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో న్యాయపరమైన, ఆర్థిక పరమైన చిక్కుల గురించి అధ్యయనం చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రష్యాలోని ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ క్షేత్రాల్లో భారత కంపెనీలు 5.46 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. ఆయా క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్‌ విక్రయంపై వచ్చే లాభాల నుంచి తమ వంతు వాటా వీటికి వస్తుంటుంది.

రష్యాపై ఆంక్షల తర్వాత అక్కడి నుంచి నిధుల బదిలీకి అవకాశం లేకుండా పోయింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్‌ పెట్టేందుకు తమ దేశం నుంచి డాలర్లను వెనక్కి తీసుకెళ్లే విషయంలో రష్యా ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణం. రష్యా బ్యాంకుల్లోని ఖాతాల్లో తమకు రావాల్సిన 150 మిలియన్‌ డాలర్ల డివిడెండ్‌ ఆదాయం చిక్కుకుపోయినట్టు ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్, ఎండీ రంజిత్‌ రథ్‌ తెలిపారు. ఐవోసీ, భారత్‌ పెట్రో రీసోర్సెస్‌తో కలిపితే రావాల్సిన డివిడెండ్‌ 450 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు