80 లక్షల మంది కస్టమర్లకు బీమా: టెలినార్

16 Feb, 2016 02:36 IST|Sakshi
80 లక్షల మంది కస్టమర్లకు బీమా: టెలినార్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘సురక్ష’ బీమా పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఆరు సర్కిళ్లలో 1.8 కోట్ల మంది కస్టమర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, సుమారు 80 లక్షల మంది బీమా రక్షణ పొందారని కంపెనీ వెల్లడించింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 20 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 50 శాతం మంది బీమా కవరేజ్ పొందారని టెలినార్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. టెలినార్ సురక్ష కింద కస్టమర్లకు రూ.50 వేల వరకు బీమా కవరేజ్ ఇస్తున్నట్టు చెప్పారు.

బీమా కోసం వినియోగదార్లు ఎటువంటి ప్రీమియం చెల్లించక్కర లేదు. ఒక నెలలో చేసిన రిచార్జ్ మొత్తానికి రూ.50 వేలకు మించకుండా తదుపరి నెలకు 100 రెట్లు కవరేజ్ ఉంటుంది. ఉదాహరణకు జనవరిలో మొత్తం రూ.200 రిచార్జ్ చేసిన వినియోగదారుడికి ఫిబ్రవరిలో రూ.20 వేల బీమా కవరేజ్ ఇస్తారు. ఒక నెలలో కనీసం రూ.40 రిచార్జ్ చేయాలి. క్లెయిమ్‌ను వారం లోపే పరిష్కరిస్తారు. కస్టమర్ మృతి చెందితే మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ గుర్తింపు కార్డు, సిమ్ కార్డుతో కంపెనీని సంప్రదించాలి. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక కస్టమర్ చనిపోతే ఆయన కుటుంబానికి రూ.50 వేల చెక్కును కంపెనీ అందజేసింది. దేశవ్యాప్తంగా కంపెనీ చందాదారుల సంఖ్య 5 కోట్లకుపైమాటే.

 

మరిన్ని వార్తలు