తెలుగు రాష్ట్రాల్లో కోటికి చేరువ

25 Jun, 2015 00:18 IST|Sakshi
తెలుగు రాష్ట్రాల్లో కోటికి చేరువ

♦ సామాజిక భద్రత పథకాలకు మంచి స్పందన.
♦ సురక్ష బీమా పథకానికి అధిక ఆదరణ
♦ అటల్ పెన్షన్ పథకానికి నామమాత్రపు స్పందన
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక భద్రతా పథకాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పథకాల్లో సుమారు 12 కోట్ల మంది చేరితే అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ పథకాల్లో చేరుతున్నవారి సంఖ్య కోటి మార్కును సమీపిస్తోంది. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన ఇచ్చిన స్ఫూర్తితో కేంద్రం అందరికీ బీమా రక్షణ, పెన్షన్ కల్పించే విధంగా మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది.

కేవలం ఏడాదికి రూ. 12 ప్రీమియంతో రెండు లక్షల ప్రమాద బీమా ప్రయోజనం కల్పించే విధంగా సురక్ష బీమా, రూ. 330 వార్షిక ప్రీమియంతో రెండు లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని కల్పించే విధంగా జీవన్ జ్యోతి బీమా పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసానిచ్చే విధంగా అటల్ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ మూడింటిలో సురక్ష బీమాకి అత్యధిక ఆదరణ లభిస్తుండగా, పెన్షన్ పథకంలో తక్కువ చేరుతున్నారు. తక్కువ ప్రీమియం ఉండటం, 70 ఏళ్ళ వారి వరకూ తీసుకోవడానికి అర్హత ఉండటంతో సురక్ష బీమా పథకంలో అత్యధికమంది చేరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ(ఏపీఎస్‌ఎల్‌బీసీ) పేర్కొంది.

జీవన్ జ్యోతిలో 50 ఏళ్ల లోపు వారు మాత్రమే చేరే అవకాశం ఉండటం, ప్రీమియం ఏటా రూ. 330 చెల్లించాల్సి రావటంతో తక్కువ మంది చేరుతున్నట్లు ఏపీఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. అలాగే పెన్షన్ పథకంలో చేరే వారి వయస్సు, ఆదాయం పరిమితులు వంటి అనేక షరతులు విధించడంతో ఇందులో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్ల  కమిటీ పేర్కొంది. ఈ పథకాల్లో చేరడానికి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగవచ్చనేది ఇరు రాష్ట్రాల బ్యాంకర్ల కమిటీ అంచనా. గడువు ముగిసేనాటికి రెండు రాష్ట్రాల్లో లబ్ధిదారుల సంఖ్య 2 కోట్లు దాటొచ్చన్న ఆశాభావాన్ని బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు