పరిశ్రమలు కుదేల్!

13 Dec, 2014 01:03 IST|Sakshi
పరిశ్రమలు కుదేల్!

అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి 4.2% క్షీణత
తయారీ, క్యాపిటల్ గూడ్స్,వినియోగ ఉత్పత్తుల రంగాలు పేలవం
రేట్ల కోత తప్పదంటున్న పారిశ్రామిక రంగం

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో దారుణ ఫలితాన్ని నమోదుచేసుకుంది. 2013 అక్టోబర్‌లో నమోదయిన విలువతో పోల్చి, 2014 అక్టోబర్ విలువను చూస్తే, అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదు చేసుకుంది. ఈ  క్షీణత రేటు -4.2 శాతంగా ఉంది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి.  ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం  పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత గణాంకాలను విడుదల చేసింది. వడ్డీరేట్ల కోతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం ఇక తప్పదని, తద్వారానే పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి సాధ్యమవుతుందని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతంగా ఉన్న ఐఐపీ సెప్టెంబర్‌లో కనీసం 2.8 శాతం వృద్ధినైనా సాధించింది. అయితే ఆ మరుసటి నెలలోనే ఏకంగా క్షీణతలోకి జారిపోవడం పారిశ్రామిక, పాలనా వర్గాలను నిరాశకు గురిచేసింది. అక్టోబర్‌లో  తయారీ రంగంసహా, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్, వినియోగ ఉత్పత్తుల విభాగం పేలవ పనితీరును నమోదుచేసుకున్నాయి. ఆయా రంగాల పనితీరును పరిశీలిస్తే...

మొత్తం ఐఐపీ సూచీలో 75 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో అక్టోబర్‌లో అసలు వృద్ధి లేకపోగా -7.6 క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ క్షీణత 1.3 శాతమే.  ఈ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 అక్టోబర్‌లో ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి.  కాగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 7 నెలల కాలంలో చూస్తే మాత్రం వృద్ధి రేటు కొంత మెరుగుదలతో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే - 0.1 శాతం క్షీణత నుంచి 0.7 శాతం వృద్ధికి చేరింది.

క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి గత ఏడాది అక్టోబర్‌లో కనీసం 2.5 శాతం వృద్ధిని సాధిస్తే, ఈ ఏడాది ఇదే నెలలో ఈ రేటు ఏకంగా -2.3 క్షీణతలోకి జారిపోయింది. అయితే 7 నెలల కాలంలో ఈ రంగం 0.2 శాతం క్షీణత నుంచి 4.8 శాతం వృద్ధికి మళ్లింది.
వినియోగ వస్తువుల ఉత్పత్తిలో క్షీణత - 5 శాతం నుంచి మరింతగా -18.6 శాతానికి జారింది. ఏడు నెలల కాలంలో కూడా ఈ క్షీణత రేటు -1.7 శాతం నుంచి -6.3 శాతానికి దిగింది.
విద్యుత్ ఉత్పత్తి మాత్రం మంచి పురోగతి సాధించింది. వృద్ధి రేటు 1.3 శాతం నుంచి ఈ రంగం 13.3 శాతం వృద్ధికి పురోగమించింది. ఏడు నెలల కాలంలో సైతం ఈ రేటు 5.3 శాతం నుంచి 10.7 శాతానికి ఎగసింది.
మైనింగ్ రంగంలో కూడా మంచి పనితీరుతో -2.9 శాతం క్షీణత నుంచి 5.2 శాతం వృద్ధి బాటకు మళ్లింది. ఏడు నెలల్లో కూడా -2.6 క్షీణత రేటు 2.4 శాతం వృద్ధికి మళ్లింది.

 7 నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 1.9 శాతానికి మెరుగ్గా ఉంది. అయితే రానున్న నెలల గణాంకాల్లో తాజా క్షీణ ధోరణే పునరావృతం అయితే ఈ స్వల్ప వృద్ధి రేటు సైతం కరిగిపోయే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు