ట్రాయ్‌ పరిధిలోకి వాట్సాప్, గూగుల్‌ డుయో!?

13 Nov, 2018 00:23 IST|Sakshi

సంప్రదింపులు ఆరంభించిన టెలికం నియంత్రణ సంస్థ...

న్యూఢిల్లీ: టెలికం సంస్థల మాదిరే మెస్సేజ్‌లు, కాల్స్‌కు అవకాశం కల్పిస్తున్న వాట్సాప్, స్కైప్, ఫేస్‌బుక్, గూగుల్‌ డుయో తదితర ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) సేవలను నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై ట్రాయ్‌ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత నియంత్రణ విధానంలో తేవాల్సిన మార్పులపై విశ్లేషణకు, చర్చకు అవకాశం కల్పించడం కోసం ఈ పత్రాన్ని తీసుకొచ్చింది. ఇంటర్నెట్‌ ఆధారంగా కాల్స్, మెస్సేజింగ్‌ సేవల అప్లికేషన్లను ఓటీటీగా పేర్కొంటారు.

స్కైప్, వాట్సాప్, వైబర్, హైక్, ట్విట్టర్‌ తదితర అప్లికేషన్లన్నీ ఓటీటీ సేవలకు సంబంధించినవే. టెలికం కంపెనీలు అందించే సేవలకు సమానంగానే ఈ ఓటీటీ సేవలను కూడా పరిగణించి... నియంత్రణ, లైసెన్సింగ్‌ నిబంధనల విషయంలో ఒకే విధంగా వ్యవహరించాలా? అన్న దానిపై పరిశ్రమ అభిప్రాయాలను ట్రాయ్‌ కోరింది. టెలికం కంపెనీలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి సేవలు అందిస్తుంటే, ఓటీటీ సేవల కంపెనీలు పెద్దగా పెట్టుబడులు అవసరం లేకుండానే టెలికం నెట్‌వర్క్‌లపై ఈ సేవల్ని అందించే అవకాశం ఉండడం గమనార్హం.

దీంతో ఓటీటీకి, టెలికం కంపెనీలకు నియంత్రణ లేదా లైసెన్సింగ్‌ నిబంధనల పరంగా ఉన్న అసమతుల్యత వల్ల... అది టెలికం నెట్‌వర్క్‌ల విస్తరణ, టెక్నాలజీ ఉన్నతీకరణ కోసం కంపెనీలు చేసే పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుందా? అలాగే, టెలికం నెట్‌వర్క్‌లపై ఓటీటీ సేవల సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించడం ఎలా అన్న అంశాలు కూడా ఈ చర్చా పత్రంలో ఉన్నాయి. ఇందులో పేర్కొన్న అంశాలపై డిసెంబర్‌ 10 వరకు పరిశ్రమ తన అభిప్రాయాలను తెలియజేయాలని ట్రాయ్‌ కోరింది. ట్రాయ్‌ తాజా ప్రతిపాదనలు స్కైప్, వాట్సాప్, వైబర్, హైక్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ తదితర సంస్థలపై ప్రభావం చూపిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇవి వీడియో అగ్రిగేషన్‌ సైట్లకు వర్తించదు.

మరిన్ని వార్తలు