విస్తరణపై విజయా బ్యాంక్ దృష్టి

25 Jul, 2015 00:34 IST|Sakshi
విస్తరణపై విజయా బ్యాంక్ దృష్టి

సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలు
♦ ఉత్తరాదిలో మరో 2 రీజనల్ శాఖలు
♦ ఈ ఏడాది వ్యాపారంలో 14% వ్యాపార వృద్ధి లక్ష్యం
♦ క్యూ3లో రూ. 500 కోట్ల క్విప్ ఇష్యూ
♦ బ్యాంక్ ఎండీ, సీఈవో కిషోర్ సాన్సే
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగానూ, విదేశాల్లోనూ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నట్లు ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ ప్రకటించింది. సింగపూర్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర మధ్యప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆర్‌బీఐ అనుమతి కోరినట్లు విజయా బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో కిషోర్ సాన్సే తెలిపారు. ఈ అనుమతులు రావడానికి 12 నుంచి 15 నెలల సమయం పడుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాన్సే మాట్లాడుతూ దక్షిణాది బ్యాంక్ ముద్రను చెరిపేసుకొని పాన్ ఇండియా విస్తరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా రానున్న తొమ్మిది నెలల్లో ఉత్తర భారత దేశంలో కొత్తగా రెండు రీజినల్ ఆఫీసులను ప్రారంభించడంతో పాటు కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన మూడు నెలల కొత్తగా 74 శాఖలను ఏర్పాటు చేయగా వచ్చే తొమ్మిది నెలల్లో మరో 150 శాఖలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. దీంతో వచ్చే మార్చినాటికి మొత్తం శాఖల సంఖ్య 1,627 నుంచి 1,840కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శివార్లలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు శాఖలను సాన్సే శనివారం ప్రారంభించనున్నారు.

 14 శాతం వృద్ధి లక్ష్యం
 ఈ ఏడాది వ్యాపారంలో 14 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు విజయా బ్యాంక్ తెలిపింది. మార్చినాటికి బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ. 2.14 లక్షల కోట్లుగా ఉంది. ఇంకా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోకపోవడంతో రుణాల మంజూ రులో ఆచితూచి అడుగులు వేస్తున్నామని, ప్రధానంగా రిటైల్, వ్యవసాయ రుణాలపై దృష్టిసారిస్తున్నట్లు సాన్సే తెలిపారు. వ్యాపార విస్తరణకు ఈ ఏడాది రూ. 500 కోట్ల మూలధనం సమకూర్చాల్సిందిగా కేం ద్రాన్ని కోరినట్లు తెలిపారు.

కేంద్ర నిర్ణయాన్ని బట్టి మూడో త్రైమాసికంలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ ద్వారా రూ. 400 నుంచి రూ. 500 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులో కేంద్రానికి 74 శాతం వాటా ఉంది. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలు ఒక స్పష్టతను ఇవ్వలేకపోయాయని, దీంతో ఆగస్టు సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు