ఉసురు తీసిన నిద్రమత్తు.. | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన నిద్రమత్తు..

Published Sat, Jul 25 2015 12:29 AM

Pushkarni three pilgrims killed in road accident

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పుష్కర యూత్రికులు మృతి
ఇద్దరికి తీవ్రగాయూలు

 
తాడేపల్లిగూడెం : నిద్రమత్తులో కారు నడుపుతూ అదుపుతప్పి తాడిచెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పుష్కర స్నానమాచరించి స్వస్థలాలకు వెళుతున్న వీరు మార్గమధ్యలోనే అనంత లోకాలకు వెళ్లిపోయూరు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలులో కేఎస్‌ఎన్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో విజయవాడకు చెందిన పప్పు వీఎస్‌ఎస్‌కేహెచ్ ప్రసాద్ (36), ఎన్‌వీఎస్ ప్రసాద్ (30), పామర్తి పాపారావు (60) మృతి చెందగా, కారు నడుపుతున్న పామర్తి బాలాజీ (పాపారావు కుమారుడు), చేరి సృజన తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా విజయవాడ బెంజి సర్కిల్‌లో వొడాఫోన్ కంపెనీకి చెందిన ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న 10 మంది ఉద్యోగులు పుష్కర స్నానాలు చేసేందుకు గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రెండు కార్లలో రాజమండ్రి బయలుదేరారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు కోటి లింగాల రేవులో పుష్కర స్నానాలు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. తాడేపల్లిగూడెం ప్రాంతానికి వచ్చేసరికి కారు నడుపుతున్న పామర్తి బాలాజీ కునికిపాట్లు పడటంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వెళ్లి తాడిచెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవడంతో వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు, ముందు సీట్లో ఎడమ వైపు కూర్చున్న మరొకరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితులను 108 అంబులెన్స్‌లో, మృతదేహాలను మరో అంబులెన్స్‌లో ఏరియూ ఆస్పత్రికి తరలించారు. శవపంచానామా అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

 బోరుమన్న మిత్రులు..
 రాజమండ్రి నుంచి 9.30 గంటల ప్రాంతంలో కారులో బయలుదేరిన మరో ఐదుగురికి ప్రమాదం విషయం తెలియలేదు. విజయవాడ వెళుతున్న వీరు ఘటనాస్థలి వద్ద గుమిగూడిన జనాన్ని చూసి కారు ఆపారు. తమ స్నేహితులు మృత్యువాత పడ్డారని తెలుసుకుని బోరుమని విలపించారు. ప్రమాద వివరాలు బంధువులు, స్నేహితులు, కాల్ సెంటర్ నిర్వాహకులకు తెలిపారు.  
 
 

Advertisement
Advertisement