వర్చువల్‌ కరెన్సీలతో రిస్కులు

2 Mar, 2017 00:59 IST|Sakshi
వర్చువల్‌ కరెన్సీలతో రిస్కులు

ఆర్థిక, చట్టపరమైన సమస్యలు
ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ


ముంబై: బిట్‌కాయిన్‌ వంటి వర్చువల్‌ కరెన్సీల వాడకంలో అనేక రిస్కులు ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యుటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ హెచ్చరించారు. ఆర్థికంగా, చట్టపరంగా, వినియోగదారుల హక్కుల పరిరక్షణపరంగా, భద్రతాపరంగానూ పలు ముప్పులు ఉంటాయని ఆయన వివరించారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్, సాఫ్ట్‌వేర్‌ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా గాంధీ ఈ విషయాలు తెలిపారు. డిజిటల్‌ ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉండే వర్చువల్‌ కరెన్సీలకు .. హ్యాకింగ్, పాస్‌వర్డ్‌ చౌర్యం, మాల్వేర్‌ దాడుల ముప్పు కూడా ఉంటుందని గాంధీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

నియంత్రణ వ్యవస్థలు లేవు...
వర్చువల్‌ కరెన్సీలను  నియంత్రించేందుకు ఎలాంటి కేంద్రీయ బ్యాంకులు లేవని ఆయన చెప్పారు. కస్టమర్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఎటువంటి వ్యవస్థా వీటికి ఉండదన్నారు. చట్టవిరుద్ధమైన, అక్రమ కార్యకలాపాలకు వర్చువల్‌ కరెన్సీలు ఉపయోగపడుతున్నట్లు అనేక కేసులు కూడా నమోదైనట్లు గాంధీ చెప్పారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత బిట్‌కాయిన్‌ తదితర వర్చువల్‌ కరెన్సీలు వేటికైనా ప్రారంభ దశలోనే విశ్వసనీయత ఉంటుందని, తర్వాత దశల్లో కూడా దాన్ని కాపాడుకుంటేనే మనుగడ ఉండగలదని ఆయన చెప్పారు.

‘ప్రారంభ దశలో అడ్వెంచరిస్టులు, రిస్కులు తీసుకునే వారు ఉంటారు. తర్వాత మిగతావారు చేరతారు. రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడని వారు కూడా క్రమంగా చేరాలంటే వర్చువల్‌ కరెన్సీకి ఆమోదయోగ్యత ఉంటుందని, కొనసాగుతుందన్న నమ్మకం వారిలో కలగాలి. అప్పుడే ఇటువంటి కరెన్సీలకు మనుగడ ఉంటుంది‘ అని గాంధీ వివరించారు. నియంత్రణ సంస్థల పరిధిలో ఉన్నప్పుడే ఏ కరెన్సీపైన అయినా నమ్మకం ఉంటుందని గాంధీ వివరించారు.

కరెన్సీ చలామణీ కనుమరుగు అపోహే...
వర్చువల్‌ కరెన్సీ రాకతో కరెన్సీ చలామణీ పూర్తిగా కనుమరుగవుతుందన్నది అపోహేనని గాంధీ స్పష్టం చేశారు. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీలు..  ఆర్థిక సేవల పరిశ్రమలో వేగంగా పెను మార్పులు తీసుకొస్తున్నాయని ఆయన చెప్పారు. బ్యాంకుల వంటి ఆర్థిక సేవల సంస్థలు కూడా ఫైనాన్షియల్‌ టెక్నాలజీ ప్రయోజనాలను గుర్తిస్తున్నాయని గాంధీ ఈ సందర్భంగా అన్నారు.

మరిన్ని వార్తలు