వన్‌ మినిట్‌ ఎఫెక్ట్‌ కష్టాల పరీక్ష | Sakshi
Sakshi News home page

వన్‌ మినిట్‌ ఎఫెక్ట్‌ కష్టాల పరీక్ష

Published Thu, Mar 2 2017 12:52 AM

వన్‌ మినిట్‌ ఎఫెక్ట్‌ కష్టాల పరీక్ష - Sakshi

నగరంలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు తొలిరోజే విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ‘ఒక్క నిమిషం’ నిబంధన వారి ఏడాది విద్యా సంవత్సరాన్ని తల్లకిందులు చేసింది. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయినవారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపేశారు. బాధిత విద్యార్థులు మూడు జిల్లాలో 5,934 మంది ఉన్నారు. తమను మోసం చేసిన శ్రీవాసవీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థులు సెక్రటేరియట్‌ను, ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు.

సిటీబ్యూరో: పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌.. నిమిషం నిబంధన.. ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌...వెరసి ఇంటర్‌ ప్రధమ సంవత్సర విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ట్రాఫిక్‌ రద్దీని ఛేదించుకుని పరీక్ష కేంద్రానికి చేరకుంటే.. ఒక్క నిమిషంతో ప్రవేశ గడువు ముగిసిందని చెప్పి వెనక్కి పంపారు. దీంతో కొంత మంది విద్యా ర్థులు పరీక్ష రాయలేక పోగా, వాహన తనిఖీల పేరుతో బుధవారం నగరంలోని రహదారులపై ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌ మరికొంత మంది గైర్హాజరీకి కారణమైంది. ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో ఉదయం 8 గంటలకే తల్లిదండ్రులు తమ పిల్లలతో వివిధ వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు బయలు దేరారు. ఒకేసమయంలో పెద్దెత్తున రోడ్డుపైకి వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీనికితోడు తనికీల పేరుతో హెల్మిట్‌లేని, లైసెన్సలను వెంట తెచ్చుకోలేని వారిని మార్గ మధ్యలో నిలిపివేయడం వల్ల వల్ల వారి పిల్లలు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పోయారు. ఫలితంగా హైదరాబాద్‌ జిల్లాలో 2,450 మంది, రంగారెడ్డి జిల్లాలో 2,099 మంది, మేడ్చల్‌ జిల్లాలో 1,385 మంది పరీక్ష రాయలేక పోయారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం 9 గంటలకు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు నిర్ధేశిత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారులు మరోసారి స్పష్టం చేశారు.  

శాపంగా మారిన ‘నిమిషం’ నిబంధన
దిల్‌సుఖ్‌నగర్‌ పరిధిలో 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక విద్యార్థిని 15 నిమిషాలు ఆలస్యం కావడంతో సదరు విద్యార్థినిని లోపలికి అనుమ తించలేదు. దీంతో ఆమె నిరాశతో వెనుతిరిగింది. మన్సూరాబాద్‌లోని నారాయణ పరీక్షా కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో ముగ్గురు విద్యార్ధులు పరీక్షా రాయలేకపోయారు. నల్లకుంట శంకరమఠం రోడ్డులోని ఓ సెంటర్‌లో పరీక్ష రాజేందుకు ముగ్గురు విద్యార్థులు రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అయినప్పటికీ సెంటర్‌ ఇంచార్జీలు విద్యార్థులను మందలించి పరీక్ష రాసేందుకు అనుమతించారు. కొన్ని సెంటర్ల వద్ద ఉదయం 8.45 గంటల తర్వాత పరీక్షా హాల్‌లోనికి అనుమతించేది లేదని నోటీసు బోర్డు పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఎగ్జామ్‌ ప్యా డ్లు, బ్యాగులు అనుమతించక పోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.  

రెండోరోజూ విద్యార్థుల ఆందోళన
వనస్థలిపురం శ్రీవాసవి జూనియర్‌ కాలేజీ యాజమాన్యం నిర్వాకం వల్ల హాల్‌టికెట్లు రాక పరీక్ష రాయలేకపోయిన 246 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రెండో రోజూ కూడా కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఫీజులు తీసుకుని హాల్‌టికెట్లు ఇవ్వని కళాశాల నిర్వాహకులను శిక్షించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. కళాశాల వద్ద ఆందోళన చేస్తే లాభం లేదని, ఇంటర్‌ బోర్డు వద్ద గానీ, విద్యాశాఖ మంత్రి వద్ద గానీ సమస్యను పరిష్కరించుకోవాలని పలువురు సూచించడంతో పోలీసులు ఏర్పాటు చేసిన వాహనంలో విద్యార్థులు విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ఆయన నివాసానికి తరలివెళ్లారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల నిర్వాహకులపై వనస్థలిపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా వాసవి జూనియర్‌ కళాశాల విద్యార్థులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. దాదాపు మూడు గంటల పాటు సచివాలయం వద్ద నిరసన తెలిపినా ఎవ్వరూ స్పందించకపోగా పోలీసులు అరెస్టు చేయడంతో విద్యార్థులు బాధను తట్టుకోలేక విలపించారు.  

ఇది ప్రభుత్వ వైఫల్యం: సుధీర్‌రెడ్డి
ఏడాది కాలంగా ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా కళాశాల నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఎల్‌బీనగర్‌ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. వేలాది రూపాయలు ఫీజులు కట్టించుకుని హాల్‌టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం ఉడాయించిందని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారని ఆవేద్య వ్యక్తం చేశారు.

వాసవీ కాలేజ్‌కు అనుమతి లేదు
వనస్థలిపురంలోని వాసవీ కాలేజ్‌కు అనుమతులు లేవు. కళాశాల దరఖాస్తు చేసుకుంటేనే బోర్డు అనుమతి ఇస్తుంది. అసలు కళాశాల యాజమాన్యం దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు సమర్పించి ఉంటే.. తనిఖీలు చేయాలని మాకు ఆదేశాలు వచ్చేవి.  ఇదేదీ జరగలేదు. విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకపోవడంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదరు కళాశాల నిర్వాకంపై గురువారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం. అయితే సదరు యాజమాన్యం రెండేళ్ల కిందట మరో పేరుతో కళాశాల స్థాపించి తాజా ఘటన తరహాలోనే విద్యార్థులను మోసగించినట్లు తెలిసింది.
– మహమూద్‌ అలీ, డీఐఈఓ, రంగారెడ్డి జిల్లా

Advertisement
Advertisement