ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్‌ దిగ్గజం పెట్టుబడులు

31 Jan, 2018 10:49 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌లో మైనార్టీ వాటా కొంటున్న వాల్‌మార్ట్‌

బెంగళూరు : అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇప్పటికే భారత్‌లో పెట్టుబడులతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీన్ని మరింత హడలెత్తిస్తూ... అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ స్టోర్లు, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మెనార్టీ వాటా కొనుగోలు చేయబోతున్నట్టు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ స్టోర్లు మైనార్టీ వాటా కొనుగోలు చేసేందుకు జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. 15 శాతం నుంచి 20 శాతం వాటాను వాల్‌మార్ట్‌ కొనుగోలు చేయబోతున్నట్టు తెలిసింది. మార్చి వరకు ఈ డీల్‌ తుది రూపం దాల్చుతుందని రిపోర్టు తెలిపింది.  ఈ డీల్‌లో భాగంగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డౌ మెక్‌మిల్లన్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఫ్లిప్‌కార్ట్‌ బెంగళూరు ఆఫీసును కూడా ఈ వారంలో ప్రారంభంలో సందర్శించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే రూమర్లు, ఊహాగానాలపై తాము ఎలాంటి కామెంట్‌ చేయమని వాల్‌మార్ట్‌ స్టోర్స్‌ అధికార ప్రతినిధి రాండీ హర్‌గ్రోవే అన్నారు. మెక్‌మిల్లన్‌ దేశంలో మూడు యూనిట్లపై సమీక్షించేందుకు వచ్చారని, నగదు, వ్యాపారాల నిర్వహణ, గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌, గ్లోబల్‌ సోర్సింగ్‌ వంటి వాటిపై ఆయన రివ్యూ చేపడుతున్నట్టు పేర్కొన్నారు.  ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ సైతం దీనిపై స్పందించలేదు. కొంతమంది దీర్ఘకాలిక పెట్టుబడిదారుల ద్వారా నిర్వహించే ప్రైమరీ, సెకండరీ సేల్స్‌ ఈ డీల్‌లో భాగమై ఉండొచ్చని తెలుస్తోంది. గతేడాదే ఫ్లిప్‌కార్ట్‌ పోటీదారి అమెజాన్‌, హోల్‌ ఫుడ్స్‌లో 400 స్టోర్‌ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసింది. భారత్‌లో అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. వాల్‌మార్ట్‌తో డీల్‌తో ఈ పోటీ మరింత తీవ్రతరం కానుంది.
 

మరిన్ని వార్తలు