సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

17 Jul, 2019 02:10 IST|Sakshi

‘నీటి’పై భారీ పెట్టుబడులు...

వచ్చే 15 ఏళ్లలో రూ. 18.9 లక్షల కోట్లు

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ అంచనా

నీటి వినియోగం తగ్గించే విధానాలు కావాలి

ప్రైవేటు పెట్టుబడులనూ ఆహ్వానించాలి

తగిన మోడళ్లు తయారు చేయాలని సూచన

ముంబై: చెన్నై నగరం ఎదుర్కొంటున్న దారుణమైన నీటి ఎద్దడిని చూస్తూనే ఉన్నాం. వందల కిలోమీటర్ల దూరం నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా నీరు చెన్నై నగరానికి చేరవేయాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. వేసవిలో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల పరిస్థితి ఇలానే ఉంది. వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని నిపుణులు, పర్యావరణ ప్రేమికులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. ఈ పరిస్థితులు దేశంలో భారీ పెట్టుబడులకు దారితీయనున్నట్లు అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ అంచనా వేసింది. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టబోయే పలు నీటి ప్రాజెక్టుల రూపేణా వచ్చే 15 ఏళ్లలో ఏకంగా 270 బిలియన్‌ డాలర్ల మేర (రూ.18.9 లక్షల కోట్లు) పెట్టుబడులు రానున్నాయి.

వివాదాస్పద నదుల అనుసంధాన ప్రాజెక్టు రూపంలోనే 168 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చే పదిహేనేళ్లలో వస్తాయి. ఇక ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించే ప్రాజెక్టు కోసం 94 బిలియన్‌ డాలర్లు అవసరం అవుతాయి’’ అని ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ‘‘ఈ తరహా ప్రాజెక్టుల కోసం అవసరమైనన్ని నిధులను సమకూర్చుకోవడం ప్రభుత్వానికి చాలా కష్టం. అందుకని ప్రైవేటు రంగమూ పాల్గొనేలా తగిన నమూనాలు రూపొందించడం అవసరం’’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ భారత విభాగ అధిపతి అమిష్‌షా పేర్కొన్నారు.
 
వ్యవసాయంలో నీటి పొదుపు అవసరం... 
సాగు రంగంలో నీటి వినియోగాన్ని తగ్గించే విధానాలపై గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని షా సూచించారు. మన దేశంలో ఒక కిలో బియ్యం పండించేందుకు 5,600 లీటర్ల నీటిని వినియోగిస్తుంటే, చైనాలో వినియోగం కేవలం 300 లీటర్లు ఉన్నట్టు తెలిపారు. ‘‘తాజా జలంలో 89 శాతాన్ని వ్యవసాయ రంగమే వాడేస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు లేదా సబ్సిడీతో కూడిన విద్యుత్‌ అధిక వాడకానికి, భూగర్భ జల వాడకానికి దారితీస్తున్నదో లేదో అనే విషయమై మనం తప్పక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించారు. గత ఐదేళ్లలోనే నీటి సంబంధిత సదుపాయాల కోసం పెట్టుబడులు ఏటేటా 15 శాతం పెరిగాయని, గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 21 బిలియన్‌ డాలర్లకు చేరాయని షా తెలిపారు. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్రాలే ఇన్వెస్ట్‌ చేశాయని, జలం అన్నది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని చెప్పారాయన. ‘‘క్లీన్‌ గంగా ప్రాజెక్టు కోసం కేంద్రం సైతం కొంత పెట్టుబడులు పెట్టింది.

ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనూ 2.5 బిలియన్‌ డాలర్లను కేటాయించారు. క్లీన్‌గంగా ప్రాజెక్టుపై గత మూడేళ్లలో 1.5 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశారు. వచ్చే ఐదేళ్లలో 3 బిలియన్‌ డాలర్లను అదనంగా ఇన్వెస్ట్‌ చేయనున్నారు. నదుల అనుసంధానానికి సంబంధించి రెండు భారీ ప్రాజెక్టుల అంచనాలు (ఏపీలో పోలవరం, యూపీలో కెంట్‌–బెటావా ప్రాజెక్టు) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ఆధారంగా చేసినవి’’ అని షా వివరించారు. మంత్రి నితిన్‌ గడ్కరీ గతంలో పేర్కొన్న గోదావరి– కృష్ణా– కావేరి అనుసంధాన ప్రాజెక్టు కేంద్రం చేపట్టబోయే తదుపరి ప్రాజెక్టుగా పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు సైతం మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులపై భారీగా వెచ్చిస్తున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు